Diabetes | వాషింగ్టన్: మనిషి కండ్లను చూసి అతనికున్న వ్యాధులను నిర్ధారించవచ్చంటున్నారు అమెరికాకు చెందిన పలు యూనివర్సిటీల పరిశోధకులు. వివిధ రకాల వ్యాధుల ప్రాథమిక దశను కంటి చూపులోనే తెలుసుకోవచ్చని చెప్తున్నారు. మధుమేహం, గుండె జబ్బులు, కిడ్నీ వైఫల్యం, రక్తహీనత, అల్జీమర్స్ వంటి వ్యాధులు సంబంధించిన ఆధారాలు కంటి స్కాన్ ద్వారా కనుగొనవచ్చని పేర్కొంటున్నారు.
కంటిలో జరిగే సూక్ష్మమైన మార్పులను బట్టి వారి ఆరోగ్య సమస్యలను తెలుసుకోవచ్చని తెలిపారు. ఆ సూక్ష్మమైన మార్పులను గుర్తించే అధునాతన ఆప్తాల్మోస్కోప్ను (కనుపాప లోపలి భాగాన్ని పరిశీలించే పరికరం) అభివృద్ధి చేసేందుకు పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు.దీనిని రూపొందించేందుకు పరిశోధకులు 2000 సంవత్సరం నుంచి ప్రయత్నిస్తున్నారు.
ఆప్తాల్మోస్కోప్ కంటి వెనుకభాగాన్ని పరిశీలించగలదు. ఆ భాగంలోని ఎర్ర రక్త కణాల కదలికలను వీరు ఆ పరికరం సాయంతో చూడగలిగారు. డయబెటిస్, హైపర్‌టెన్షన్‌కు సంబంధించిన బయోమార్కర్లను వీరు కంటి రక్తనాళాల్లో గుర్తించగలిగారు. మరోవైపు నార్త్‌వెస్టర్న్, మౌంట్ సీనాయి, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీల పరిశోధకులు ఆప్తాల్మోస్కోపిక్ పరిజ్ఞానంతో కంటిలోని వివిధ భాగాలపై పరిశోధన సాగిస్తున్నారు. ఈ పరిజ్ఞానంతో వారు సికిల్‌సెల్ అనీమియాను గుర్తించగలిగారు.