టెహ్రాన్: ఇజ్రాయిల్ చేపడుతున్న దాడుల్లో ఇప్పటి వరకు 500 మంది మరణించినట్లు ఇవాళ ఇరాన్(Iran) మీడియా ప్రకటించింది. జూన్ 13వ తేదీ నుంచి ఇరాన్‌పై ఇజ్రాయిల్ అటాక్ చేస్తున్న విషయం తెలిసిందే. మృతుల సంఖ్యపై ఇవాళ ఆ దేశ ఆరోగ్యశాఖ ప్రకటన చేసింది. ఇజ్రాయిల్ నిర్వహించిన దాడుల్లో సుమారు మూడు వేల మంది గాయపడినట్లు ఇరాన్ స్టేట్ మీడియా తెలిపింది. అయితే అంతర్జాతీయ మీడియాపై ఇరాన్ ఆంక్షలు విధించడం వల్ల పలు మీడియా సంస్థలు ఆ దేశంలోకి వెళ్లలేకపోతున్నాయి. ఇజ్రాయిల్ దాడుల వల్ల ఇరాన్లో ఎంత నష్టం జరిగిందన్న దానిపై స్పష్టమైన అంచనా వేయడం వీలుకావడం లేదు. ఇరాన్లో పనిచేస్తున్న మానవ హక్కుల సంస్థ మాత్రం మృతుల సంఖ్య రెట్టింపుగా ఉండే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నది.
ఫోర్డో భూగర్భ అణు కేంద్రంపై ఇవాళ జరిగిన దాడులు గురించి ఇజ్రాయిల్ రక్షణ దళాలు ప్రకటన చేశాయి. ఫోర్డో అణు కేంద్రానికి వెళ్లే మార్గాలపై దాడులు చేసినట్లు ఐడీఎఫ్ తెలిపింది. యాక్సెస్ రూట్లను ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. ఆదివారం తెల్లవారుజామున అమెరికాకు చెందిన బీ2 బాంబర్లు.. ఫోర్డో న్యూక్లియర్ సైట్‌పై బంకర్ బస్టర్ బాంబర్లతో దాడి చేసిన విషయం తెలిసిందే.
ఇరాన్ గగనతలంలోకి కమర్షియల్ విమానాలు ప్రవేశించడం లేదు. ప్రస్తుత డేటా ప్రకారం ఇరాన్ గగన క్షేత్రాన్ని కమర్షియల్ ఫ్లయిట్స్ దూరంగా పెట్టినట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో పాటు ఇరాక్, సిరియా, జోర్డాన్, లెబనాన్ ఎయిర్‌స్పేస్‌ను కూడా విమానాలు వాడుకోవడంలేదు. దుబాయ్ ఎయిర్‌పోర్టులో ఇవాళ సుమారు 120 విమానాలు ఆలస్యం అయ్యాయి. జోర్డాన్‌లోని క్వీన్ అలియా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో 40 శాతం విమానాలు రద్దు అయ్యాయి. దుబాయ్‌కి వెళ్లే విమానాలను జూలై 3వ తేదీ వరకు యునైటెడ్ ఎయిర్‌లైన్స్ రద్దు చేసింది. దుబాయ్, దోహాలకు బ్రిటీష్ ఎయిర్వేస్ తన విమానాలను రద్దు చేసింది.