చిలీ : ఉత్తర చిలీలో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఇక్విక్ నగరంలో భారీ మంటలు చెలరేగాయి. మంటల ధాటికి సుమారు 100 ఇండ్లు పూర్తిగా దగ్ధమైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. స్థానికంగా నీటి సదుపాయం లేకపోవడంతో మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
ప్రయివేటు నీటి ట్యాంకర్లను తీసుకొచ్చి మంటలను అదుపు చేశారు. మంటలు చెలరేగిన ప్రాంతం ఇరుకుగా ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
భారీ అగ్నిప్రమాదం నేపథ్యంలో స్థానికులను పోలీసులు వేరే ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నించారు. కానీ తాము ఇక్కడ్నుంచి వెళ్లబోమని స్థానికులు చెప్పారు. అగ్నిప్రమాదంతో నిరాశ్రయులైన 400 మందికి అధికారులు ఆశ్రయం కల్పించారు.