కుపర్టినో: యాపిల్ సంస్థ కీలక ప్రకటన చేసింది. భారతీయ పరిశోధకుడు అమర్ సుబ్రమణ్య(Amar Subramanya)ను.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమించింది. ఏఐ రేసులో యాపిల్ సంస్థ కొంత వెనుకబడి ఉన్న విషయం తెలిసిందే. సమీప ప్రత్యర్థులు మాత్రం ఏఐ రంగంలో దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ కొన్ని మార్పులు చేసింది. ప్రత్యర్థి శాంసంగ్‌కు ధీటుగా యాపిల్ సంస్థ కృత్రిమ మేధపై దృష్టి పెట్టింది. మాజీ పరిశోధకుడు అమర్ సుబ్రమణ్యకు అరుదైన అవకాశాన్ని కల్పించింది. ఏఐ వైస్ ప్రెసిడెంట్ బాధ్యతలను అతనికి అప్పగించింది.
జాన్ గియన్నాండ్రియా స్థానంలో సుబ్రమణ్యకు ఆ అవకాశాన్ని కల్పించారు. మెషీన్ లెర్నింగ్, ఏఐ స్ట్రాటజీ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న జాన్ గియన్నాండ్రియా తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు యాపిల్ సంస్థ వెల్లడించింది. 2026లో ఆయన రిటైర్ కానున్నారు. అప్పటి వరకు కంపెనీ అడ్వైజర్‌గా పనిచేయనున్నట్లు సంస్థ పేర్కొన్నది. యాపిల్ ఫౌండేషన్ మోడల్స్, ఎంఎల్ రీసర్చ్, ఏఐ సేఫ్ట్ అండ్ ఎవాల్యువేషన్ లాంటి శాఖలకు సుబ్రమణ్య సారధ్యం వహించనున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సుబ్రమణ్యకు విశేష అనుభవం ఉన్నది. గత కొంత కాలం వరకు ఆయన మైక్రోసాఫ్ట్‌లోని ఏఐకి కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ గా చేశారు. దానికి పూర్వంగా ఆయన గూగుల్ సంస్థలో 16 ఏళ్లు చేశాడు. గూగుల్‌కు చెందిన జెమినీలో ఇంజినీరింగ్ హెడ్ చేశారు.