Apartment collapse | రష్యాకు చెందిన సఖాలిన్ ద్వీపంలో శనివారం ఉదయం ఓ అపార్ట్మెంట్ బ్లాక్ కుప్పకూలింది. ఈ ఘటనలో 9 మంది దుర్మరణంపాలయ్యారు. మరొకరు శిథిలాల కింద చిక్కుకున్నారు. సంఘటన ప్రాంతంలో అత్యవసరం సేవలను అధికారులు కొనసాగిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రాంతీయ గవర్నర్ ధృవీకరించారు.
రష్యా పసిఫిక్ ద్వీపం సఖాలిన్లో మాస్కో కాలమానం ప్రకారం శనివారం ఉదయం 5.30 గంటలకు ఐదంతస్థుల అపార్ట్మెంట్ బ్లాక్ ఒకటి కుప్పకూలిపోయింది. అపార్ట్మెంట్ శిథిలాల కింద చిక్కకుని 9 మంది చనిపోగా.. శిథిలాల కింద ఒకరు చిక్కకున్నారు. గ్యాస్ పేలుడు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నదని రష్యా వార్తాసంస్థలు తెలిపాయి. ఈ విపత్తుకు గల కారణాలను పరిశీలిస్తున్నట్లు రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ తెలిపింది.
వంట స్టవ్‌కు కనెక్ట్ చేసిన 20 లీటర్ల గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అత్యవసర సేవల వర్గాలను ఉటంకిస్తూ టీఏఎస్ఎస్ తెలిపింది. శిథిలాల కింద మరింత మంది ఉండొచ్చనే అనుమానంతో రెస్క్యూ బృందాలు వెతుకుతున్నాయని సఖాలిన్ గవర్నర్ వాలెరి లిమరెంకో టెలిగ్రామ్‌లో రాశారు. ఈ అపార్ట్మెంట్లో నివసించిన 33 మందిలో కొందరి ఆచూకీ తెలియడం లేదని ఆయన తెలిపారు.