న్యూఢిల్లీ, మార్చి 20 : పశ్చిమాసియా యుద్ధ రంగంలోకి మరో భారీ యుద్ధనౌక అడుగుపెడుతున్నది. ఉత్తర అరేబియా సముద్రంలో యుద్ధ క్షేత్రంలోకి 2,000 మంది నావికులతో అమెరికా యుద్ధ విమానాల వాహకనౌక యూఎస్ఎస్ ట్రిపోలి వచ్చేవారం ప్రవేశించనున్నది. 50,000 టన్నుల బరువైన ఈ నౌక ప్రవేశంతో ప్రస్తుతం కొనసాగుతున్న అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం భవిష్యత్తు తేలిపోతుంది. ప్రస్తుతం దక్షిణ హిందూ మహాసముద్రంలో శ్రీలంకకు దక్షిణం వైపున ఉన్న ట్రిపోలి గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో మోహరించి ఉన్న యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌కు మరింత బలం చేకూర్చనున్నది. 844 అడుగుల పొడవుండే యూఎస్ఎస్ ట్రిపోలిపైన ఎఫ్-35, ఎంవీ-22 అస్ప్రీ, ఎంహెచ్60ఎస్ సీహాక్ హెలికాప్టర్లు ఉంటాయి. మార్చి 22-23 తేదీల్లో ఈ నౌక యుద్ధ క్షేత్రంలోకి ప్రవేశించే అవకాశం ఉంది.
ఇరాన్‌పై భూతల యుద్ధానికి అమెరికా సన్నద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో వీటికి బలం చేకూర్చేలా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం విలేకరుల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సైనిక బలగాలను తాను ఎక్కడా మోహరించలేదని, ఒకవేళ ఆ పని చేయాల్సి వస్తే కచ్చితంగా మీకు చెప్పబోనని ట్రంప్ విలేకరులతో అన్నారు. అయితే అసహనానికి గురవుతున్న ట్రంప్ వేలాది సైనిక బలగాలను ఇరాన్‌లోకి దింపే అవకాశం ఉందని అమెరికా భద్రతాధికారులు రాయిటర్స్ వార్తాసంస్థకు తెలిపారు. ఇందుకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి హొర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించాల్సిన అవసరం ఉండడం. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి హొర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేసి నౌకల రవాణాను ఇరాన్ అడ్డుకుంటున్నది.
రెండు భారత్, పాకిస్థాన్ సహా పరిమిత సంఖ్యలో కొన్ని చమురు ట్యాంకర్లను జలసంధి గుండా ప్రయాణించడానికి అనుమతిస్తున్న ఇరాన్ పశ్చిమ దేశాలకు చెందిన నౌకలను పేల్చివేస్తామని హెచ్చరిస్తున్నది. హొర్ముజ్‌పై తన పట్టును నిలుపుకుంటున్న ఇరాన్.. జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై టోల్ ఫీజు వసూలు చేయడం ప్రారంభించింది. సురక్షితంగా బయటపడేందుకు 20 లక్షల డాలర్ల(రూ. 18 కోట్లు) టోల్ ఫీజు చెల్లించినట్లు ఓ చమురు ట్యాంకర్ నిర్వాహకుడు చెప్పినట్లు ఓ పత్రిక తెలిపింది. గత కొన్ని రోజులుగా ట్రంప్ హొర్ముజ్కు తమ యుద్ధ నౌకలను పంపాలని తన మిత్ర దేశాలపై ఒత్తిడి తెచ్చారు. అయితే దీనికి ఏ దేశమూ సానుకూలంగా స్పందించలేదు. దీంతో హొర్ముజ్‌ను తెరిపించడానికి నావికాదళ బలగాలతో తన యుద్ధ నౌక యూఎస్ఎస్ ట్రిపోలిని అక్కడికి పంపిస్తుండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేగాక ఇరాన్‌కు దక్షిణ కోస్తా సమీపంలో ఉన్న ఒకటి రెండు ద్వీపాలను స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్ ట్రిపోలిలోని బలగాలను ఉపయోగించవచ్చని మరి కొందరు అమెరికా ప్రభుత్వ అధికారులు అంచనా వేశారు. వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు జరుపకుండా అడ్డుకునేందుకు ఈ ద్వీపాలను ట్రంప్ వాడుకునే అవకాశం ఉందని వారు చెప్పారు.
ఇరాన్‌కు ఆర్థిక జీవనాడిగా, 90 శాతం చమురు ఎగుమతులు జరిగేందుకు దోహదపడుతున్న ఖర్గ్ ద్వీపానికి కొన్ని సైనిక బలగాలను ట్రంప్ పంపించే అవకాశం ఉంది. ఈ ద్వీపానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని దీన్ని నాశనం చేయడం కన్నా దీన్ని తన ఆధీనంలోనే ఉంచుకోవడానికి ట్రంప్ ఇష్టపడవచ్చని అధికారులు చెప్పారు. హొర్ముజ్‌లో నౌకాయాన ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు అక్కడ బలగాలను మోహరించే విషయాన్ని ట్రంప్ పరిశీలించాలని భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ ఇటీవల సూచించారు. అయితే అణ్వస్ర్తాలను తయారుచేసేందుకు ఇరాన్ ఉపయోగించడానికి అవకాశం ఉన్న 950 పౌండ్ల శుద్ధి చేసిన యురేనియంను స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్ అమెరికా బలగాలను ఇరాన్ భూతలంపై పాదం మోపేందుకు అనుమతిస్తారన్న ప్రచారం కూడా జరుగుతున్నది. అమెరికా, ఇజ్రాయెల్ ధ్వంసం చేసిన సదుపాయాల శిథిలాల కింద ఈ యురేనియం ఉండవచ్చని, దీన్ని వెలికితీసేందుకు భూతల సైనిక బలగాలు అవసరమని అధికారులు చెప్పారు. ఇదిలా ఉండగా ట్రంప్, జపాన్ ప్రధాని తకైచీ గురువారం రహస్య చర్చలు జరిపారు. హొర్ముజ్‌పై ఇరాన్ ఆంక్షలను తొలగించాలని జపాన్ డిమాండు చేస్తున్న నేపథ్యంలో వీరిద్దరి చర్చలకు ప్రాధాన్యం ఏర్పడింది.