India Oil : పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇండియా సహా అనేక దేశాలు చమురు కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. అందుకే ఇండియా ఇప్పుడు చమురు కోసం ఏ ఒక్క దేశంపైనో ఆధారపడకుండా, అవకాశం ఉన్న ప్రతీ దేశం నుంచి చమురు దిగుమతి చేసుకుంటోంది. దీనిలో భాగంగా ఆఫ్రికాలోని చిన్న దేశమైన అంగోలా నుంచి కూడా ఇండియా చమురు దిగుమతి చేసుకుంటోంది. ఇంకా, చెప్పాలంటే ఈ దేశ చమురు మన దేశ అవసరాల్ని చాలా వరకు తీరుస్తుందనే చెప్పాలి.
కొద్ది రోజుల క్రితం రష్యా నుంచి చమురు కొనుగోలును ఇండియా తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో అంగోలా నుంచి చమురు దిగుమతులపై ఇండియా ప్రత్యేక దృష్టి పెట్టింది. అంగోలా చమురు దిగుమతిని భారీగా పెంచుకుంది. ఇటీవలి కాలంలో అంగోలా నుంచి దాదాపు 2 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్‌ను ఇండియా దిగుమతి చేసుకుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ ఈ ఆయిల్ కొనుగోలు చేసింది. హంగో ఆయిల్ ఫీల్డ్ నుంచి ఒక మిలియన్ బ్యారెల్స్, క్లావ్ క్రూడ్ నుంచి మరో మిలియన్ బ్యారెల్ క్రూడాయిల్‌ను కొనుగోలు చేసింది. ఎక్సాన్‌మొబిల్ సంస్థ వీటిని నిర్వహిస్తుంది. ఈ సంస్థ వెలికితీసే చమురు ఆసియన్ రిఫైనరీల ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ఈ క్రూడాయిల్ ప్రాసెస్ చేస్తే పెట్రోల్, డీజిల్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. నైజీరియా తర్వాత ఆఫ్రికాలో చమురు ఉత్పత్తి చేసే రెండో పెద్ద దేశం అంగోలా.
ప్రతి రోజూ 1.1 మిలియన్ బ్యారెళ్ల చమురును ఈ దేశం ఉత్పత్తి చేస్తుంది. ఈ దేశంలో 7.78 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు కలిగి ఉంది. దీంతో ఇటీవలి కాలంలో ఇండియాకు భారీ మొత్తంలో చమురు అందిస్తోంది. గతంలో ఇండియా కొన్ని దేశాల నుంచే చమురు దిగుమతులపై ఆధారపడేది. అయితే, మారుతున్న ప్రపంచ భౌగోళిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇండియా తన వ్యూహాన్ని మార్చుకుంది. అనేక దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టింది. ఇది ఇరాన్ యుద్ధం వంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది.