న్యూయార్క్, ఆగస్టు 5: అమెరికాకు వచ్చే విదేశీయులను ఏదో విధంగా ఆటంకపరచడం, దేశంలో ఉన్నవారిని ఏదో మిషతో వెళ్లిపోయేలా నిబంధనలను కఠినతరం చేస్తున్న ట్రంప్ ప్రభుత్వం తాజాగా మరో ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. బిజినెస్ లేదా పర్యాటక వీసాపై అమెరికాకు వచ్చేవారు ముందుగా 15 వేల డాలర్లు (సుమారు 13.17 లక్షలు) బాండ్ చెల్లించాల్సి ఉంటుందని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతిపాదనలు చేసింది. ఈ మేరకు ఫెడరల్ రిజిస్టర్లో ఓ నోటీసు పెట్టింది. ఇటువంటి వీసా బాండ్ల జారీకి త్వరలోనే ఓ పైలట్ ప్రోగ్రామ్ను ప్రారంభించనున్నట్టు వెల్లడించింది. ఏడాదిపాటు అమలుచేసే ఈ పైలట్ ప్రోగ్రామ్ను పక్షం రోజుల్లో ప్రారంభించనున్నట్టు తెలిపింది. ఈ బాండ్ నిబంధన కొన్ని ఎంపిక చేసిన దేశాలకు మాత్రమే అమలుచేయనుంది. ట్రంప్ టారిఫ్ బెదిరింపులతో భారత్-అమెరికా మధ్య పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ బాండ్ అంశం తెరపైకి రావడం ఆసక్తిని రేకెత్తిస్తున్నది. బాండ్ చెల్లించాల్సిన దేశాల జాబితాలో భారత్ కూడా ఉన్నదా లేదా అన్న విషయం ఇంకా తెలియరాలేదు.
అమెరికా విదేశాంగ శాఖ ప్రతిపాదించిన పైలట్ ప్రోగ్రామ్ ప్రకారం బిజినెస్ లేదా టూరిస్ట్ వీసా కోసం దరఖాస్తు చేసుకొనేవారు 5000, 10000, 15,000 డాలర్ల చొప్పున సెక్యూరిటీ బాండ్లను చెల్లించాల్సి ఉంటుంది. వీసా పొందిన వారు అమెరికా నిబంధనలకు అనుగుణంగా నడుచుకొని, గడువు పూర్తయిన వెంటనే దేశం వీడితే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. అలాకాకుండా అమెరికాలో ఉన్నప్పుడు చట్టవిరుద్ధంగా వ్యవహరించినా, వీసా గడువు ముగిశాక కూడా అక్కడే ఉన్నా ఆ సొమ్ము తిరిగి రాదు.
గడువు తీరినా అమెరికాలో ఉంటే వీసా రద్దు
వీసా గడువు తీరిన తర్వాత అమెరికాలో ఉంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, వీసా రద్దు చేస్తామని యూఎస్ ఎంబసీ హెచ్చరించింది. అలాంటి వారిపై బహిష్కరణ వేటు వేయడమేగాక, మళ్లీ అమెరికాలో అడుగుపెట్టకుండా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టంచేసింది.