ఇతర దేశాల ప్రజలు భారతీయ సంస్కృతికి ఆకర్షితులవుతారు. ఇక్కడి కట్టుబొట్టును అనుకరిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. కాగా, ఓ అమెరికన్ యూట్యూబర్ తమిళంలో ఫుడ్ ఆర్డర్ ఇస్తూ భారతీయ నెటిజన్ల మనసు దోచుకుంటున్నాడు. అతడు తమిళంలో మాట్లాడుతున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
క్జియోమానిక్ అనే యూ ట్యూబ్ చానల్ నడుపుతున్న యూఎస్ వ్యక్తి అరీహ్ స్మిత్‌కు తమిళ భాష అంటే ఇష్టం. ప్రపంచంలోనే తమిళం పురాతన భాష అని తెలుసుకుని మాట్లాడడం నేర్చుకున్నాడు. న్యూయార్క్ నగరంలోని తమిళషాపులను వెదుక్కుంటూ వచ్చి, అక్కడ తమిళంలో ఫుడ్ ఆర్డర్ ఇస్తుంటాడు. అతడు తమిళంలో ఫుడ్ ఆర్డర్ ఇచ్చే వీడియోలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. అతడు తమిళంలో మాట్లాడడంతో ఓ దుకాణ యజమాని మురిసిపోయాడు. స్మిత్ వద్ద డబ్బులు కూడా తీసుకోలేదు. ఈ వీడియో చూసిన భారతీయ నెటిజన్లు కూడా స్మిత్‌ను ప్రశంసించారు.