న్యూఢిల్లీ, ఆగస్టు 9: ఇతర దేశాలతో వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వీయ విధ్వంసానికి పాల్పడుతున్నారని అమెరికన్ ఆర్థికవేత్త, జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టేవ్ హాంకె తెలిపారు. సుంకాలపై ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని పనికిమాలినదిగా ఆయన అభివర్ణించారు. ట్రంప్ లెక్కలన్నీ తప్పుడు తడకలని ఆయన విమర్శించారు. ట్రంప్ కట్టిన పేక మేడ కూలిపోవడం ఖాయమని, సుంకాల కారణంగా ఏర్పడిన ఆర్థిక ప్రకంపనలు ట్రంప్ పేకమేడను కూల్చివేస్తాయని ఆయన తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు భారత్‌పై విధించిన సుంకాన్ని 50 శాతానికి పెంచిన నేపథ్యంలో ప్రొఫెసర్ హాంక్ ఎన్డీటీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. నెపోలియన్ సలహాను పాటించడం అత్యుత్తమని ఆయన అన్నారు. తనను తాను నాశనం చేసుకునే ప్రక్రియలో శత్రువు విషయంలో ఎన్నడూ కల్పించుకోరాదని నెపోలియన్ చెప్పారని, ఇప్పుడు ట్రంప్ తనను తాను నాశనం చేసుకుంటున్నారని తాను భావిస్తున్నానని ప్రొఫెసర్ చెప్పారు. భారత్ విషయానికి వస్తే ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కొద్దికాలం మౌనంగా వేచి ఉండడం మంచిదని సలహా ఇచ్చారు. జీడీపీ కన్నా అధికంగా అమెరికా ప్రభుత్వం ఖర్చు చేస్తున్న కారణంగా భారీ వాణిజ్య లోటును ఎదుర్కొంటుందని ఆయన తెలిపారు.
రష్యా, చైనా నుంచి భారత్‌ను దూరం చేసేందుకు దశాబ్దాలుగా అమెరికా చేస్తున్న ప్రయత్నాలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బ తీశారని అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు, ట్రంప్ మాజీ సహాయకుడు జాన్ బోల్టన్ వ్యాఖ్యానించారు. రష్యా చమురును కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై భారీ సుంకాలను విధించడం.. భారత్‌ను కాదని చైనా పట్ల పక్షపాతం చూపడమేనని ఆయన విమర్శించారు.
ట్రంప్ చర్యలు తీవ్ర తప్పిదంగా ఆయన అభివర్ణిస్తూ అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సుంకాల విధింపుతో అమెరికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని, చైనాకు తక్కువ సుంకాలు విధించి తమకు భారీ సుంకాలు విధించడంపై భారత్ తీవ్రంగా ప్రతిస్పందించిందని ఆయన అన్నారు. ఆ మూడు దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా చేతులు కలిపే అవకాశం ఉందన్నారు.