Gold Card | వాషింగ్టన్: అమెరికా పౌరసత్వానికి వీలు కల్పించే గోల్డ్ కార్డును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ఆవిష్కరించారు. తానే తొలి కొనుగోలుదారుడినని పేర్కొన్నారు. 35 ఏండ్ల క్రితం ప్రవేశపెట్టిన ఈబీ-5 ఇన్వెస్టర్ వీసాల స్థానంలో వీటిని తీసుకొచ్చారు. 5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.43 కోట్లు) చెల్లించి ఈ కార్డును పొందొచ్చని ట్రంప్ వెల్లడించారు. ఈ కార్డుల అమ్మకం ద్వారా తమ దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠ పరచాలని యూఎస్ అధికారులు భావిస్తున్నారు.
అర్హత కలిగిన విదేశీయులకు ఈ కార్డులను అమ్మడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని వారు భావిస్తున్నారు. ఈ గోల్డ్ కార్డు వెంటనే అమెరికా పౌరసత్వాన్ని కల్పించకపోయినప్పటికీ.. దాన్ని పొందేందుకు మార్గాన్ని ఏర్పరుస్తుంది. ‘ఇది గ్రీన్ కార్డ్ అందించే ప్రయోజనాలను కల్పించడంతో పాటు పౌరసత్వానికి మార్గం అవుతుంది’ అని ట్రంప్ మీడియాతో అన్నారు.