వాషింగ్టన్ : ప్రపంచ ప్రజలందరికీ అత్యుత్తమ ఆరోగ్యాన్ని అందించే లక్ష్యంతో ఏర్పాటైన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌వో) నుంచి అగ్రరాజ్యం అమెరికా అధికారికంగా వైదొలగింది. తమకు డబ్ల్యూహెచ్‌వోలో తిరిగి చేరే ఉద్దేశం లేదని ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారి ఒకరు స్పష్టం చేశారు. వ్యాధుల పర్యవేక్షణ, ఇతర ప్రాధాన్యతలపై అమెరికా ఇక నుంచి నేరుగానే ఇతర దేశాలతో కలిసి పనిచేస్తుందని ఆయన తెలిపారు. డబ్ల్యూహెచ్‌వోకు ఫీజు కింద అమెరికా సుమారు రూ.2,400 కోట్లు చెల్లించాల్సి ఉంది.
అయితే తమ వద్ద నుంచి అవసరమైన దాని కన్నా ఎక్కువగానే ఆ సంస్థ తీసుకుందని, తాము ఎలాంటి బకాయిలు చెల్లించబోమంటూ అమెరికా స్పష్టం చేసింది. అగ్రరాజ్యం తీసుకున్న నిర్ణయం ఒక్క అమెరికాపైనే కాక, మిగిలిన దేశాల ఆరోగ్య వ్యవస్థలపై పడుతుందని, ఇది యూఎస్ చట్ట ఉల్లంఘన కిందకు వస్తుందని కొందరు నిపుణులు పేర్కొన్నారు. తాను రెండోసారి అధికారం చేపట్టాక డబ్ల్యూహెచ్‌వో నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్టు ట్రంప్ ప్రకటించారు. వ్యాధుల నిరోధంలో డబ్ల్యూహెచ్‌వో పూర్తిగా విఫలమైందని అమెరికా ఆరోపిస్తున్నది.