వాషింగ్టన్ : భారత దేశంపై టారిఫ్‌ల దాడి చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అమెరికన్ ఆర్థికవేత్త రిచర్డ్ వూల్ఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ వైఖరి వల్ల అమెరికాకు ఎదురుదెబ్బ తగులుతుందని హెచ్చరించారు. బ్రిక్స్ వంటి ప్రత్యామ్నాయ ఆర్థిక మండళ్లు బలోపేతమవుతాయని జోస్యం చెప్పారు. చిన్న దేశాలపై ఒత్తిడి చేసినట్లుగా, భారత దేశంతో అమెరికా వ్యవహరించజాలదని స్పష్టం చేశారు. వూల్ఫ్ న్యూయార్క్‌లోని న్యూ స్కూల్లో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్. అమెరికా భారత్ వంటి దేశంతో మాట్లాడటం కన్నా లెబనాన్ వంటి చిన్న మధ్య ప్రాచ్య దేశంతో మాట్లాడటం భిన్నంగా ఉంటుందని వూల్ఫ్ అన్నారు.
జనాభాను బట్టి భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్దదని, చైనాను అధిగమించిందని చెప్పారు. భారత దేశంపై తన టారిఫ్‌ల బెదిరింపులను కొనసాగిస్తే, ఆయన ఓ ప్రత్యేకమైన ప్రత్యర్థితో ఆడుకుంటున్నట్లేనని వివరించారు. వూల్ఫ్ రష్యన్ జర్నలిస్ట్ రిక్ శాంచెజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ మార్కెట్‌ను భారత ఎగుమతులకు మూసివేస్తే, భారత దేశం అభివృద్ధి చెందుతున్న ఇతర మార్కెట్లకు దగ్గర అవుతుందని వూల్ఫ్ చెప్పారు. పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించడంతో రష్యా మరో మార్కెట్‌ను చూసుకున్నట్లుగానే, భారత దేశం కూడా తన ఎగుమతులను అమెరికాకు కాకుండా, బ్రిక్స్ దేశాలకు పంపిస్తుందన్నారు.
రష్యా చమురు దిగుమతుల సాకుతో కేవలం భారత్‌ను మాత్రమే టార్గెట్ చేయడం పట్ల విపక్ష డెమోక్రాట్లు అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్‌ను తీవ్రంగా తప్పుబట్టారు. ఇదేం పాలసీ, ఇదేం కక్ష సాధింపని నిలదీశారు. దీని కారణంగా దేశీయంగా అమెరికన్లకు తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించారు. మాస్కోలో అతి పెద్ద ముడి చమురు ఎగుమతిదారులలో ఒకటైన చైనాపై ఎటువంటి జరిమానాలను విధించకుండా, రష్యా చమురు కొనుగోలు విషయంలో భారత్‌ను మాత్రమే టార్గెట్ చేసినందుకు అధ్యక్షుడు ట్రంప్, ఆయన పరిపాలనను యూఎస్ హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీలోని డెమోక్రాట్లు తీవ్రంగా విమర్శించారు.
భారత్‌పై ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలు అమెరిన్లను దెబ్బతీస్తున్నాయని, గత రెండు దశాబ్దాలుగా ద్వైపాక్షిక ప్రయత్నాల ద్వారా భారత్-అమెరికా మధ్య ఏర్పడిన సత్సంబంధాలను విధ్వంసం చేస్తున్నాయని వారు విమర్శించారు. రష్యా నుంచి పెద్దయెత్తున చమురును కొనుగోలు చేస్తున్న చైనా, ఇతర దేశాలపై ఆంక్షలు విధించడానికి బదులుగా భారత్‌పై అదనపు సుంకాలు విధించడం వల్ల అమెరికన్ సమాజానికి నష్టాన్ని కలిగించడమే కాక, రెండు దేశాల సంబంధాలు దెబ్బతింటాయని అన్నారు.