Air Canada | కెనడాలోని టోరంటో నుంచి బయలుదేరిన ఎయిర్ కెనడా విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఇంజిన్ నుంచి మంటలు రావడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. శుక్రవారం ఉదయం 12.17 గంటలకు టోరంటో నుంచి బోయింగ్ 777 విమానం బయలుదేరింది. అప్పుడు విమానంలో 13 మంది క్రూ సిబ్బందితోపాటు 389 మంది ప్రయాణికులు ఉన్నారు. టేకాఫ్ కాగానే విమానం కుడి వైపు ఇంజిన్ నుంచి మంటలు రావడం మొదలైంది. రన్ వే మీదుగా పైకి ఎగురుతుండగా ఇంజిన్ నుంచి వస్తున్న మంటలను గమనించిన గ్రౌండ్ సిబ్బంది వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌ను అప్రమత్తం చేశారు. దీంతో నిమిషాల్లోనే విమానాన్ని తిరిగి ల్యాండిగ్ చేశారు.
ఈ ఘటనపై స్పందించిన ఎయిర్ కెనాడా.. ‘విమానంలో గల కంప్రెసర్ ఆగిపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే, ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ఓ ప్రకటనలో తెలిపింది.