వాషింగ్టన్: మనుషుల మాదిరి ఆలోచించే ఏజీఐ (ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్) 2030 నాటికి మనుషుల్ని మించిపోనుందని గూగుల్ డీప్‌మైండ్ సీఈవో డెమిస్ హస్సబిస్ తెలిపారు. స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయం వినడానికి తనకే ఆశ్చర్యంగా ఉందన్నారు. అప్పటి నుంచి ‘కొత్త మానవ శకం’ ప్రారంభమవుతుందని తెలిపారు.
ఏజీఐతో ఒక యంత్రం కూడా మనిషి సామర్థ్యంతో సమానంగా లేదా అంతకంటే బాగా తనకు ఇచ్చిన లక్షాన్ని పూర్తి చేయగలదు. ఇది 2030 నాటికి సాధ్యమని హస్సబిస్ చెప్తున్నారు. ఏజీఐ రోగాలను నయం చేయగలదు, ఆర్థిక పరిస్థితిని మార్చగలదు, ప్రపంచాన్ని భయ రహితం చేయగలదు. అదే సమయంలో దాని వల్ల ఉద్యోగాల కోతలు, దాన్ని నియంత్రించడం ఎలా అన్న ప్రశ్నలు, సమాజంపై నిరోధించలేని ప్రభావం లాంటి సమస్యలు పుట్టుకొస్తాయి అని పేర్కొన్నారు.