పారిస్, ఫిబ్రవరి 5: ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఇస్మాయిలీ ముస్లిముల నాయకుడు, ప్రముఖ వితరణశీలి ఆగా ఖాన్ తన 88వ ఏట కాలధర్మం చెందారు. వర్థమాన దేశాలలో అనాథాశ్రమాలు, దవాఖానలు, పాఠశాలలు నిర్మించి వేల కోట్ల రూపాయలను సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేసిన ఆగా ఖాన్ తన 20వ ఏట ఆధ్మాత్మిక నాయకుడిగా మారారు. షియా ఇస్మాయిలీ ముస్లిముల 49వ వారసత్వ ఇమామ్, నాలుగవ ఆగా ఖాన్ ప్రిన్స్ కరీం అల్-హుస్సేనీ తన కుటుంబ సభ్యుల సమక్షంలో పోర్చుగల్‌లో మంగళవారం కన్నుమూసినట్టు ఆయన స్థాపించిన ఆగా ఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్, ఇస్మాయిలీ మత సంస్థ ప్రకటించింది. తన వారసుడిగా, ఐదో ఆగాఖాన్‌గా, 50వ వారసత్వ ఇమామ్‌గా తన కుమారుడు రహీం అల్ హుస్సేనీని నియమిస్తూ ఆయన తన వీలునామాలో పేర్కొన్నట్టు తెలిపింది.
హార్వర్డ్ చదువును మధ్యలోనే వదిలేసి..
ప్రవక్త ప్రత్యక్ష శిష్యుడిగా తమ ఆధ్యాత్మిక నాయకుడిని ఆగా ఖాన్ అనుచరులు పరిగణిస్తారు. తన వారసుడిగా ఆగా ఖాన్ పేరును ఆయన తాతగారు ప్రకటించినపుడు ఆయన హార్వర్డ్‌లో చదువుకుంటున్నారు. శృంగార పురుషుడిగా ముద్రపడిన తన కుమారుడిని కాదని తన ఆధ్మాత్మిక వారసత్వాన్ని తన మనవడికి అందచేశారు ఆగాఖాన్ తాతగారు. అనంతరం కాలంలో తమ కుటుంబ వ్యాపార సామ్రాజ్యంతోపాటు దాతృత్వ కార్యక్రమాలను ఆగా ఖాన్ సమర్థంగా నిర్వహించారు. 1957 జూలైలో క్వీన్ ఎలిజెబెత్ ఆయనకు హిస్ హైనెస్ బిరుదును అందచేశారు. ఒకనాడు తన అనుచరులు బహుమతిగా అందచేసిన వజ్రాలతో తన తాతగారు తులాభారం వేయించుకున్న టాంజానియాలోని తలామ్లో 1957 అక్టోబర్ 19న నాలుగవ ఆగా ఖాన్‌గా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2015లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది.
సేవా కార్యక్రమాలకు ఏటా 8500 కోట్ల ఖర్చు..
దాతృత్వ సంస్థ ఆగా ఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ 30కి పైగా దేశాలలో ఆరోగ్య రక్షణ, గృహనిర్మాణం, విద్య, గ్రామీణ ఆర్థికాభివృద్ధి తదితర రంగాలలో సేవా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. లాభాపేక్ష లేని అభివృద్ధి కార్యకలాపాల కోసం ఏటా దాదాపు రూ. 8,500 కోట్ల మేరకు ఖర్చు చేస్తున్నది. బంగ్లాదేశ్, తజికిస్థాన్, అఫ్గానిస్థాన్ తదితర పేద దేశాలలో ఆరోగ్య రక్షణ కోసం ఆగా ఖాన్ పేరిట దవాఖానాలు పనిచేస్తున్నాయి. ఫ్రాన్స్‌లో అనేక దశాబ్దాలు గడిపిన ఆగా ఖాన్ గత కొన్ని సంవత్సరాలుగా పోర్చుగల్‌లో ఉంటున్నారు. ఆయన డెవలప్మెంట్ నెట్వర్క్, ఫౌండేషన్ స్విట్జర్లాండ్‌లో ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్నది. ఆగా ఖాన్‌కు ముగ్గురు కుమారులు,ఒక కుమార్తె, పలువురు మనవలు, మనవరాళ్లు ఉన్నారు.
ప్రధాని మోదీ సంతాపం
ఆగా ఖాన్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఆగాఖాన్ గొప్ప దార్శనికునిగా అభివర్ణించిన ప్రధాని ఆయన తనజీవితాన్ని ప్రజల సేవకు, ఆధ్మాత్మికతకు అంకితం చేశారని కొనియాడారు. ఆరోగ్య, విద్య, గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత వంటి రంగాలలో ఆయన అందచేసిన సేవలు ప్రజలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆగా ఖాన్ కుటుంబ సభ్యులు, కోట్లాది మంది అనుచరులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రధాని ప్రకటించారు.