Russia : భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై ఆ రెండు దేశాలు పరస్పర చర్చలు జరుపాలని ఇప్పటికే అమెరికా (US), చైనా (China) భారత్‌కు సూచించాయి. తాజాగా రష్యా (Russia) కూడా ఆ జాబితాలో చేరింది. ‘ఇరుదేశాల మధ్య ఉన్న సమస్యలపై భారత్, పాకిస్థాన్ ప్రత్యక్ష శాంతి ఒప్పంద చర్చలు జరపాలని ఆశిస్తున్నాం. ఈ విషయంలో ఇరుదేశాలు పరస్పర విశ్వాసంతో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం’ అని రష్యన్ ఫెడరేషన్ విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా పేర్కొన్నారు.
ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్-పాకిస్థాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా స్పందిస్తూ.. భారత్, పాక్‌ల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించింది. రెండు దేశాల మధ్య సంఘర్షణ నివారణకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ప్రకటించింది. రెండు దేశాలు శాంతి మార్గాన్ని ఎంచుకోవడాన్ని అభినందిస్తున్నామని వ్యాఖ్యానించింది.
భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు చెలరేగినప్పుడు తమ మద్దతు పాక్‌కే అని తెగేసి చెప్పిన చైనా.. ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణను మాత్రం సమర్థిస్తున్నట్లు పేర్కొంది. చర్చలు, సంప్రదింపుల ద్వారా ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించింది. ఇదిలావుంటే భారత్‌తో చర్చలకు పాక్ సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే కశ్మీర్ అంశం కూడా చర్చల్లో చేర్చాలనేది తమ షరతు అని పేర్కొంది.