Tiktok | చైనా యాజమాన్యంలోని టిక్‌టాక్ యాప్‌కు వరుసగా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే భారత్, అమెరికా, డెన్మార్క్, కెనడా దేశాలు బ్యాన్ యాప్‌పై బ్యాన్ విధించాయి. యూజర్ల ప్రైవసీ, జాతీయ భద్రతా కారణాల నేపథ్యంలో నిషేధం విధించాయి. తాజాగా బెల్జియం సైతం పలు ఆంక్షలు విధించింది. బెల్జియంలోని ప్రభుత్వ ఉద్యోగులు టిక్‌టాక్‌ను వాడకుండగా నిషేధం విధిస్తూ బెల్జియం ప్రధాని ఆదేశాలు జారీ చేశారు. ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై తమ పని ఫోన్లలో చైనీస్ యాజమాన్యంలోని వీడియో యాప్ టిక్‌టాక్‌ను ఉపయోగించేందుకు అనుమతి లేదని బెల్జియం ప్రధానమంత్రి అలెగ్జాండర్ డి క్రూ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బెల్జియం జాతీయ భద్రతా మండలి హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. టిక్‌టాక్ కంపెనీ చైనా ఇంటిలిజెన్స్ సర్వీసెస్‌కు సహాయం చేస్తోందని పేర్కొన్నారు.
ఈ క్రమంలో ఫెడరల్ ప్రభుత్వం అందించే ఫోన్లలో టిక్‌టాక్‌ను నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే పలు దేశాలు టిక్‌టాక్‌ను నిషేధించాయి. డెన్మార్క్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రభుత్వ ఉద్యోగుల ఫోన్లలో టిక్‌టాక్ వాడకాన్ని నిషేధించింది. అమెరికాలో ప్రభుత్వ గాడ్జెట్లలో టిక్‌టాక్‌ను నిషేధించింది. ఆ తర్వాత టిక్‌టాక్ వంటి ప్రమాదకర యాప్‌లను నిషేధించే బిల్లును వైట్‌హౌస్ సైతం ఆమోదించింది. అనేక ఇతర దేశాలలో కూడా టిక్‌టాక్‌ను నిషేధించాలనే డిమాండ్ ఉంది. యూరోపియన్ యూనియన్, తైవాన్, ఆఫ్ఘనిస్తాన్, కెనడా, పాక్‌లోనూ టిక్‌టాక్‌పై పాక్షింగా నిషేధం విధించారు. 2020లో టిక్‌టాక్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. 29 జూన్ 2020న 59 చైనీస్ యాప్‌లను నిషేధించింది. ఇంత పెద్ద సంఖ్యలో మొబైల్ యాప్‌లను ప్రభుత్వం నిషేధించడం ఇదే మొదటిసారి. ఇందులో టిక్‌టాక్, క్యామ్ స్కానర్, పబ్జీ సహా పలు యాప్‌లు ఉన్నాయి.