వాషింగ్టన్ : హెచ్-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేసిన తర్వాత ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు విదేశీ విద్యార్థుల ఆప్షనల్ ట్రెయినింగ్ప్రోగ్రామ్(OPT)పై కన్నేసింది. తాము చదువుకుంటున్న రంగంతో ముడిపడిన ఉద్యోగాన్ని ఎఫ్-1 వీసా విద్యార్థులు తాత్కాలికంగా చేసుకోవడానికి ఓపీటీ ప్రోగ్రామ్ అవకాశం కల్పిస్తుంది. ఓపీటీ ప్రోగ్రామ్ని రద్దు చేయాలని పలువురు పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు ప్రతిపాదిస్తున్నారు. ప్రస్తుత ఓపీటీ ప్రోగ్రామ్ని విమర్శించిన డైరెక్టర్ ఆఫ్ పాలసీ స్టడీస్ జెస్పికా వాఘన్ అమెరికన్ పార్లమెంట్ అటువంటి వీసా క్యాటగిరీలను కఠినతరం చేయాలని లేదా రద్దు చేయాలని ప్రతిపాదించారు.
అంతేగాక ఓపీటీ విద్యార్థుల సంపాదనపై పన్ను విధించాలని కూడా కొందరు పార్లమెంట్ సభ్యులు ప్రతిపాదించారు. ప్రస్తుతం విదేశీ విద్యార్థుల ఓపీటీ ప్రోగ్రామ్‌పై పన్నులేదు. ఇదిలా ఉండగా చదువుకోసం వచ్చే ఎఫ్-1 విద్యార్థులకు నాలుగేళ్ల గరిష్ఠ కాలపరిమితిని విధించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్) మరో ప్రతిపాదన ముందుకు తీసుకువచ్చింది. దీని ఫలితంగా అంతర్జాతీయ విద్యార్థులకు విదేశీ చదువుకు ప్రధాన గమ్యస్థానంగా ఉన్న అమెరికా ఇక ఆ స్థానాన్ని కోల్పోయే రోజులు ఎంతోదూరంలో లేవు.