న్యూఢిల్లీ, మే 20 : ఆర్థికంగా చితికిపోయిన అఫ్ఘానిస్థాన్ నుంచి వేదనకు గురిచేసే ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. తిండి, వైద్య ఖర్చులు, రుణ విముక్తి కోసం నిరుపేద కుటుంబాలు ముక్కుపచ్చలారని తమ కుమార్తెలను అమ్ముకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతులేని నిరుద్యోగం, అధ్వానంగా మారిన ఆరోగ్య రక్షణ వ్యవస్థ, క్షీణించిన అంతర్జాతీయ సహాయం నడుమ అఫ్ఘాన్‌లోని ప్రతి నలుగురు పౌరులలో ముగ్గురు తమ ప్రాథమిక అవసరాలు కూడా తీర్చుకోలేని దుస్థితిలో ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. అఫ్ఘాన్ జనాభాలో 10 శాతం మంది అంటే దాదాపు 47 లక్షల మంది దుర్భిక్షానికి అడుగు దూరంలో ఉన్నట్లు యూఎన్ అంచనా వేసింది.
దేశవ్యాప్తంగా ఆహారం కోసం ప్రజలు అల్లాడుతున్న నేపథ్యంలో ఘోర్ ప్రావిన్సులో పేదరికం, నిరుద్యోగంతో పోరాడుతున్న తండ్రులు విధిలేని పరిస్థితుల్లో అసాధారణ పనులకు పాల్పడవలసి వస్తోందని బీబీసీ తెలిపింది. కటిక పేదరికం, అప్పులు, ఉపాధి లేకపోవడం వంటి సమస్యల కారణంగా కుటుంబాన్ని పోషించే మార్గం లేక తన ఏడేండ్ల కవల కుమార్తెలలో ఒక బాలికను విక్రయించాలని యోచిస్తున్నట్లు అదే ప్రావిన్సుకు చెందిన అబ్దుల్ రషీన్ అజీమీ రోదిస్తూ బీబీసీకి తెలిపాడు. సయీద్ అహ్మద్ అనే మరో తండ్రి మాట్లాడుతూ అపెండిసైటిస్, కాలేయంలో గడ్డతో బాధపడుతున్న తన ఐదేండ్ల కుమార్తెకు వైద్య చికిత్స ఇప్పించే స్తోమత లేక తన బంధువుకు అమ్ముకున్నట్లు చెప్పారు.