న్యూఢిల్లీ : చైనాలో భారీ బంగారు గని బయల్పడింది. ఈ గనిలో దాదాపు 1000 టన్నుల అత్యంత నాణ్యమైన పుత్తడి నిల్వలు ఉన్నాయని, ఈ బంగారం విలువ సుమారు 83 బిలియన్ డాలర్ల (రూ.7,01,885 కోట్లు) మేరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదిగా పరిగణిస్తున్న ఈ పుత్తడి గని దక్షిణాఫ్రికాలోని సౌత్ డీప్ మైన్ (900 టన్నులు) కంటే పెద్దదని చెప్తున్నారు.
పింగ్జియాంగ్ కౌంటీలో ఈ భారీ బంగారు గని ఉన్నట్టు హునాన్ ప్రావిన్స్ జియోలాజికల్ బ్యూరో ప్రకటించింది. భూగర్భ శాస్త్రవేత్తలు 2 కిలోమీటర్ల లోతులో 40 గోల్డ్ వెయిన్స్(బంగారం కలిగిన రాతి పొరలు)ను గుర్తించినట్టు వెల్లడించింది. ఈ వెయిన్స్లో 300 టన్నుల బంగారం ఉండవచ్చని, 3 కిలోమీటర్ల లోతులో మరిన్ని నిల్వలు ఉంటాయని తెలిసింది.