Noble Cause | బ్రిటన్‌కు చెందిన ఓ 90 ఏండ్ల వృద్ధుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతను 15,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానం నుంచి దూకడం ఈ వీడియోలో కనిపిస్తున్నది. ఫ్రాంక్ వృత్తిరీత్యా స్టంట్‌మ్యాన్ కాదు. కానీ ఒక గొప్ప కార్యం కోసం ఇంతటి సాహసానికి ఫ్రాంక్ పూనుకున్నాడు. ఆయన స్ఫూర్తిని సోషల్ మీడియాలో నెటిజెన్లు కొనియాడుతున్నారు.
యూకేలోని నార్త్ యార్క్‌షైర్‌లో వృద్ధుడు ఫ్రాంక్ వార్డ్ నివసిస్తున్నాడు. ఈయన భార్య మార్గరెట్ స్థానికంగా నర్సింగ్ హోమ్ నడుపుతున్నది. ఈ నర్సింగ్ హోంకు వచ్చే వృద్ధులు, వికలాంగులను తీసుకెళ్లేందుకు అవసరమైన వీల్చైర్లు లేవు. దాంతో దవాఖానకు వచ్చే వృద్ధులు, వికలాంగులు చాలా ఇబ్బందులు పడటం ఫ్రాంక్ వార్డ్‌ను తీవ్రంగా కలిచివేసింది. ఈ సమస్యను పరిష్కరించే మార్గం కోసం ఎన్నో రకాలుగా ఆలోచించాడు. చివరకు నిధులు సేకరించేందుకు 15 వేల అడుగుల ఎత్తు నుంచి దూకాలని ఫ్రాంక్ వార్డ్ నిర్ణయించాడు.
ఈ సాహస కార్యం చేపట్టిన ఫ్రాంక్ వార్డ్ ఇప్పటి వరకు 1958 డాలర్లు సేకరించారు. మున్ముందు వృద్ధాశ్రమంలో కూడా వీల్చెయిర్లు అందించేందుకు సాయపడతామని ఆయన చెప్పాడు. 95 ఏండ్ల వయస్సులో ఈ పని చేయలేనని, అందుకే ఇప్పుడే చేశానని చెప్తుండటం ఆయన కార్యదీక్షను చాటిచెప్తున్నది.