హ్యూస్టన్: అమెరికాలోని టెక్సాస్‌లో 90 అడుగుల ఎత్తైన హనుమంతుడి కాంస్య విగ్రహం ఏర్పాటైంది. ఇది అగ్రరాజ్యంలోనే మూడో అతిపెద్దది. దీనికి ‘స్టాట్యూ ఆఫ్ యూనియన్’ (ఐక్యతా విగ్రహం) అని పేరు పెట్టారు. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన విగ్రహాల్లో ఒకటైన ఇది.. భారతదేశం వెలుపల ఉన్న అత్యంత ఎత్తైన ఆంజనేయుడి విగ్రహంగానూ రికార్డులకెక్కింది.
టెక్సాస్‌లోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా మరో రికార్డు కూడా సొంతం చేసుకుంది. సుగర్ ల్యాండ్‌లోని శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో చినజీయర్‌స్వామి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇందులో భాగంగా ఈ నెల 15 నుంచి 18 వరకు ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నిస్వార్థం, భక్తి, ఐక్యతకు గుర్తుగా ఈ విగ్రహాన్ని నిర్వాహకులు అభివర్ణించారు.