Uganda Stampede | ఉగాండా రాజధాని కంపాలాలో కొత్త సంవత్సరం వేళ విషాదం చోటుచేసుకున్నది. వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 9 మంది చనిపోయారు. కంపాలాలోని ఫ్రీడమ్ సిటీ మాల్లో అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
కొత్త సంవత్సరం సందర్భంగా కంపాలాలోని ఫ్రీడమ్ సిటీ మాల్ బాణాసంచా విక్రయాలను చేపట్టింది. టపాసులు కొనుగోలు చేసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు సిటీ మాల్‌కు రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో పలువురు కిందపడిపోయారు. పదుల సంఖ్యలో స్థానికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచాం. తొక్కిసలాటలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం పలువురిని స్థానిక దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో నలుగురు మరణించారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు.
న్యూ ఇయర్ బాణాసంచా కాల్చేందుకు చాలా మంది ఒకేసారి పరుగు తీశారని పోలీసులు తెలిపారు. దీంతో మాల్లోని చిన్న హాలులో జనం కిక్కిరిసిపోయారు. గుంపులో చాలా మంది ఊపిరాడక కిందపడిపోయారు. ఇంత పెద్ద సంఖ్యలో జనం గుమికూడేందుకు కారకులెవరు అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.