Israel | న్యూయార్క్, అక్టోబర్ 20: ఉత్తరగాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు కొనసాగించిన దాడుల్లో పలు గృహాలు ధ్వంసమయ్యాయని, 87 మంది ప్రజలు మరణించడమో, గల్లంతు కావడమో జరిగిందని పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. బీట్లాహియాలో ఇజ్రాయెల్ పదాతి దళాలు జరిపిన దాడుల్లో 40 మంది పౌరులు గాయపడ్డారని వెల్లడించింది. ఉత్తర గాజాలో శనివారం రాత్రి నుంచి ఇంటర్నెట్ కట్ అయినట్టు అధికారులు తెలిపారు. అయితే దీనిపై ఇజ్రాయెల్ మిలటరీ ఎలాంటి వివరాలు తెలుపలేదు. తమ పదాతి, వాయు దళాలు గాజాలో దాడులు కొనసాగిస్తున్నట్టు మాత్రం పేర్కొంది.
ఇరాన్‌పై దాడికి ప్లాన్
గత నెలలో ఇరాన్ తమపై చేసిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఆ మేరకు ఇజ్రాయెల్ సన్నాహాలు కూడా చేస్తున్నది. అయితే ఇరాన్‌పై దాడికి ఇజ్రాయెల్ చేస్తున్న సైనిక సన్నాహాలను బహిర్గతం చేస్తూ రెండు అత్యంత రహస్యమైన యూఎస్ ఇంటెలిజెన్స్ పత్రాలు లీకయ్యాయని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. నేషనల్ జియో స్పేషియల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఎన్జీఏ) నుంచి వచ్చిన పత్రాలు, అమెరికన్ గూఢచారి ఉపగ్రహాలు సేకరించిన చిత్రాలు, ఇజ్రాయెల్ సైనిక సన్నాహాలు, కార్యాచరణ తదితర అంశాలు గల ఆ రహస్య పత్రాల గురించి ఇరాన్ అనుకూల టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేశారు. అక్టోబర్ 1న ఇజ్రాయెల్‌పై ఇరాన్ జరిపిన దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికే చేస్తున్న సన్నాహాల గురించి అమెరికాతో ఇజ్రాయెల్ పంచుకోగా, అవి అమెరికా నుంచి లీకైనట్టు భావిస్తున్నారు. కాగా తమ రహస్య పత్రాలు లీక్ కావడం పట్ల అమెరికా అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ పత్రాలు ఎలా లీకయ్యాయి? అని అమెరికా ఇంటెలిజెన్స్ ఆరా తీస్తున్నది. ప్రభుత్వంలోని కింది స్థాయి ఉద్యోగి ద్వారా ఇది జరిగి ఉంటుందని అనుమాన పడుతున్నది.
హెజ్బొల్లా కమాండ్ సెంటర్‌పై దాడి
లెబనాన్ రాజధాని బీరుట్లో హెజ్బొల్లా కమాండ్ సెంటర్‌తో పాటు అండర్‌గ్రౌండ్‌లో ఆయుధాలు దాచిన స్థావరంపై ఆదివారం దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది. అలాగే దక్షిణ లెబనాన్‌లో జరిపిన లక్షిత దాడుల్లో ముగ్గురు హెజ్బొల్లా కమాండర్లు మృతి చెందినట్టు తెలిపింది.
100 రాకెట్లతో విరుచుకుపడ్డ హెజ్బొల్లా
లెబనాన్ సుమారు 100 రాకెట్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. ఇరాన్ మద్దతున్న హెజ్బొల్లా ఆదివారం ఉదయమే 70 రాకెట్లు ప్రయోగించింది. కొద్ది గంటల తర్వాత మరో 30 రాకెట్లు ఇజ్రాయెల్ వైపు దూసుకుపోయాయి. వీటిలో చాలా వాటిని ఇజ్రాయెల్ వైమానిక దళం అడ్డుకుంది. కాగా, ఈ రాకెట్ల కారణంగా ఇజ్రాయెల్‌లోని కొన్ని ప్రాంతాల్లో మంటలు చెలరేగినట్టు వార్తలొచ్చాయి.
సిన్వర్ భార్య చేతిలో రూ.26 లక్షల హ్యాండ్ బ్యాగ్
ఇటీవల తాము జరిపిన దాడుల్లో హమాస్ నేత యాహ్యా సిన్వర్‌ను హతమార్చినట్టు ప్రకటించిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) తాజాగా అతనికి సంబంధించిన ఒక వీడియోను విడుదల చేసింది. గత ఏడాది అక్టోబర్ 7 దాడులకు ముందు, ముందు జాగ్రత్తగా సిన్వర్ తన గృహం కింద ఉన్న సొరంగం లోంచి కుటుంబ సభ్యులతో సహా సురక్షిత ప్రాంతానికి వెళ్తున్న ఈ వీడియోను ఉద్దేశించి ‘ఒక పక్క ఇజ్రాయెల్ మహిళలు, పిల్లలు, వృద్ధులను చంపమని ఉగ్రవాదులను పంపి, సిన్వర్ తాను, తన కుటుంబ సభ్యులు మాత్రమే క్షేమంగా ఉండాలనుకుంటున్నారు’ అని పేర్కొంది. ఈ సందర్భంగా సిన్వర్ భార్య చేతిలోని హ్యాండ్ బ్యాగ్ ఖరీదు 36 వేల డాలర్లు (సుమారు రూ.26 లక్షలు) అని తెలిపింది. తమ సభ్యులను యుద్ధంలోకి పంపి వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్న సిన్వర్, ఆయన కుటుంబం మాత్రం పూర్తి విలాసవంతమైన జీవితాన్ని గడిపారని విమర్శించింది.