సిడ్నీ: ఆస్ట్రేలియాలోని సెంట్రల్ క్వీన్స్‌లాండ్‌లో (Central Queensland) తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. విషసర్పం (Venomous Snake) నుంచి స్నేహితుడి (Friend) కాపాడబోయిన ఓ వ్యక్తి అదే పాముకాటుకు గురై మరణించాడు. ఇద్దరు సీనియర్ సిటిజన్లు సెంట్రల్ క్వీన్స్‌ల్యాండ్‌లో ఉన్న కౌమాలా స్టేస్ స్కూల్ (Koumala State School) శతాబ్ది వేడుకల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో తన స్నేహితుడి పాదాలకు పాము చుట్టుకోవడాన్ని 69 ఏండ్ల వృద్ధుడు గమనించాడు. విషసర్పం బారి నుంచి అతడిని తప్పించాలనుకున్నాడు. దీంతో పామును అతని కాలు నుంచి వేరుచేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో పాము అతని చేయి, ఛాతీపై పలుమార్లు కాటు వేసింది. అయినప్పటికీ పట్టువిడవని అతడు ఆ పామును స్నేహితుని కాళ్ల నుంచి వేరుచేసి పక్కకు పడేశాడు.
అయితే అప్పటికే విషం అతని శరీరం మొత్తానికి పాకింది. కార్డిక్ అరెస్ట్ (Cardiac arrest) కావడంతో అక్కడే స్పృహతప్పి పడిపోయాడు. దీంతో అక్కడున్నవారు అతనికి సీపీఆర్ (CPR) చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దవాఖానకు తరలించే లోపే అతడు మరణించాడు. ఈ ఘటన అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.