ఖట్మండూ: హిమాలయ దేశం నేపాల్లో కొండచరియలు (Landslide) విరిగిపడటంతో ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులు నదిలోకి దూసుకెళ్లాయి. దీంతో 66 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. ఏంజెల్ బస్సు, గణపతి డీలక్స్ దేశ రాజధాని ఖట్మండూకి వెళ్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 3 గంటలకు సెంట్రల్ నేపాల్లోని మదన్-ఆష్రిత్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అదుపుతప్పిన రెండు బస్సులు త్రిశూలి నదిలో పడిపోయాయి. నదీ ప్రవాహ తీవ్రతతో అవి రెండు కొట్టుకుపోయాయని ప్రభుత్వ ప్రతినిధి ఖిమా నంద భుసాల్ చెప్పారు.
ఓ బస్సులో 24 మంది ఉండగా, మరో బస్సులో 41 మంది ఉన్నారని పోలీసులు తెలిపారు. గల్లంతైనవారికోసం గాలిస్తున్నామని చెప్పారు. అయితే ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నదని తెలిపారు. కాగా, నేపాల్లో వర్షాకాలం జూన్లో మొదలై సెప్టెంబర్లో ముగుస్తుంది. ఈ సమయంలో హిమాలయదేశంలో భారీ వర్షాలు కురుస్తాయి. దీంతో విరివిగా కొండచరియలు విరిగిపడుతూ ఉంటాయి.