Terror incident | బెలూచిస్థాన్లో జరిగిన పలు బాంబు పేలుళ్లలో కెప్టెన్ సహా ఆరుగురు పాకిస్తాన్ భద్రతా సిబ్బంది మృతిచెందారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. నాలుగు పేలుళ్లలో రెండు క్వెట్టాలో, ఒకటి కోహ్లు జిల్లాలోని కహాన్ ప్రాంతంలో, మరొకటి టర్బత్‌లో జరిగింది. వరుసగా ఏడు బాంబు పేలుళ్లు జరిగినట్లు పాకిస్తాన్‌కు చెందిన వార్తాపత్రిక డాన్ నివేదించింది.
ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ ప్రకారం, కోహ్లు జిల్లాలోని కహాన్ ప్రాంతంలోని ఓ పార్టీ కార్యాలయం దగ్గర ఇంటెలిజెన్స్ ఆధారిత క్లియరెన్స్ ఆపరేషన్‌లో ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరం (ఐఈడీ) పేలింది. ఆదివారం బెలూచిస్తాన్‌లో మొత్తం ఐదు పేలుళ్లు జరగ్గా 15 మంది గాయపడినట్లు డాన్ పత్రిక తన కథనంలో పేర్కొన్నది. భద్రతా బలగాలకు చెందిన కార్యాలయం వద్దకు ఐఈడీ తీసుకెళ్లి పేల్చినట్లు ఆర్మీ మీడియా విభాగం తెలిపింది. ఈ పేలుడులో కెప్టెన్ ఫహాద్, లాన్స్ నాయక్ ఇంతియాజ్, కానిస్టేబుళ్లు అస్గర్, మెహ్రాన్, షామూన్ మరణించారు.
మరోవైపు క్వెట్టాలో జరిగిన గ్రనేడ్ పేలుడులో కనీసం నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన క్వెట్టాలోని సబ్జల్ రోడ్డులో జరిగినట్లు బెలూచిస్తాన్ చీఫ్ మినిస్టర్ అబ్దుల్ కుడూస్ బిజెంజో ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, సంబాజా ప్రాంతంలో ఉగ్రవాదులు-భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ టెర్రరిస్ట్, ఓ జవాన్ మృతిచెందారు. మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుళ్లతో పాకిస్తాన్ పెద్ద మొత్తంలో ఉగ్రవాదుల దాడుల నుంచి ముప్పు పొంచి ఉన్నదని నిపుణులు భావిస్తున్నారు.