మాస్కో: రష్యాలోని సైబేరియాలో ఉన్న ఓ బొగ్గు గనిలో (Coal mine) జరిగిన ప్రమాదంలో 52 మంది మృతిచెందారు. సేజేరియాలోని కెమెరోవో ప్రాంతంలో ఉన్న బొగ్గు గనిలో గురువారం గ్యాస్ లీకవడంతో భారీ పేలుళ్లు సంభవించాయని అధికారులు చెప్పారు. దీంతో ఆరుగురు సహాయక సిబ్బంది సహా 52 మంది దుర్మరణం పాలయ్యారని వెల్లడించారు. దాదాపు 820 అడుగుల లోతులో జరిగిన ఈ ప్రమాదం నుంచి 239 మందిని రక్షించామని చెప్పారు. మరో 35 మంది కనిపించకుండా పోయారని చెప్పారు. ఈ ప్రమాదంలో 44 మంది తీవ్రంగా గాయపడ్డారని, వారిని దవాఖానకు తరలించామన్నారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.
ఎలాంటి భద్రతా నిబంధనలను పాటించక పోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని, దీంతో మైన్ డైరెక్టర్ సహా ఇద్దరు సీనియర్ అధికారులను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ దుర్ఘటనపై అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతాపం తెలిపారు. గాయపడిన వారికి అన్ని విధాల సాహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. కెమెరోవో ప్రాంతంలో మూడు రోజులపాటు సంతాప దినాలను ప్రకటించారు.
గత దశాబ్ద కాలంలో రష్యాలో జరిగిన బొగ్గు గనుల ప్రమాదాల్లో ఇదే అతిపెద్దది. 2010లో ఓ మైన్లో జరిగిన ప్రమాదంలో 91 మంది ప్రాణాలు కోల్పోయారు. 2004లో జరిగిన మరో ప్రమాదంలో 13 మంది మృతిచెందారు. కాగా, రష్యాలో 58 బొగ్గు గనులు ప్రమాదకమైనవని 2016లో అధికారులు గుర్తించారు. అయితే ప్రస్తుతం ప్రమాదం జరిగిన బొగ్గు గని ఆ జాబితాలో లేకపోవడం గమనార్హం.