న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లో తీవ్ర రాజకీయ సంక్షోభం ఆ దేశ ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తున్నది. వేల సంఖ్యలో నైపుణ్యం ఉన్న ఉద్యోగులు దేశాన్ని విడిచి వెళ్తున్నారు. గత రెండేళ్లలో ఆ సంఖ్య మరింత రెట్టింపు అయినట్లు తెలుస్తోంది. కొనసాగుతున్న రాజకీయ అనిశ్చిత వల్ల.. దేశ ఆర్థిక పరిస్థితి కూడా దిగజారిపోతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. గత రెండేళ్లలో 5000 మంది డాక్టర్లు, 11000 మంది ఇంజినీర్లు, 13000 మంది అకౌంటెంట్లు పాకిస్థాన్‌ను వీడి వెళ్లినట్లు ఓ ప్రభుత్వ నివేదిక ద్వారా వెల్లడైంది. బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అండ్ ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ ఈ డేటాను రిలీజ్ చేసింది. అయితే ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీ .. ఈ వలసలను బ్రెయిన్ గెయిన్గా వర్ణించారు. నిజానికి బ్రెయిన్ డ్రెయిన్ అవుతున్న విషయాన్ని పాకిస్థాన్ గ్రహించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. పాకిస్థాన్ మాజీ సేనేటర్ ముస్తాఫా నవాజ్ కోకర్ ఈ రిపోర్టును ప్రస్తావించారు. దేశ ఆర్థిక వ్యవస్థను సరిచేయాలంటే ముందుగా రాజకీయ వ్యవస్థను సరిచేయాలన్నారు. ఇంటర్నెట్ షట్‌డౌన్ ద్వారా దేశానికి 1.62 బిలియన్ల డాలర్ల నష్టం వచ్చిందన్నారు.