North Korea | ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్లో ఐదు రోజుల లాక్డౌన్ విధించారు. ఇక్కడి ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతుండటంతో ముందస్తుగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తున్నది. ప్రభుత్వ నోటీసును ఉటంకిస్తూ దక్షిణ కొరియాకు చెందిన ఎన్కే న్యూస్ ఈ సమాచారాన్ని అందించింది. అయితే, కరోనా వైరస్ ప్రస్తావన ఎక్కడా లేకపోవడం విశేషం.
అందిన సమాచారం ప్రకారం, ప్యాంగ్యాంగ్లో ప్రజలు గత రెండు రోజులుగా శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. దాంతో ప్రభుత్వం ప్యాంగ్యాంగ్లో ఐదు రోజులపాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ప్రభుత్వ నోటీసులో కరోనా వైరస్ ప్రస్తావన లేదు. కేవలం శ్వాసకోశ సంబంధ వ్యాధుల గురించే నోటీసులో పేర్కొన్నారు. ప్యాంగ్యాంగ్ వాసులు ఆదివారం వరకు ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం సూచించింది. ప్రజలు తమ శరీర టెంపరేచర్‌ను రోజులో వీలైనన్ని ఎక్కువ సార్లు తనిఖీ చేసి నమోదు చేసుకోవాలని సలహా కూడా జారీ చేసింది.
ఇలాఉండగా, ప్రభుత్వం నుంచి లాక్డౌన్ నిర్ణయం రాకముందే ప్యాంగ్యాంగ్ ప్రజానీకం ఇళ్లలో వస్తువులను నిల్వ ఉంచుకునే పనిలో నిమగ్నమవడం కనిపించారు. దేశంలోని ఇతర నగరాల్లో కూడా లాక్డౌన్ విధించారనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. ఇటీవల లూనార్ న్యూ ఇయర్ సందర్భంగా ప్యాంగ్యాంగ్ నుంచి వచ్చిన ప్రజలు డబుల్ ఫేస్ మాస్క్‌లు ధరించి ఉన్నారు. తమ దేశంలో కరోనా వ్యాప్తి లేదని తొలి నుంచి ఉత్తర కొరియా ప్రభుత్వం చెప్తూ వచ్చింది. అయితే, ఇక్కడ గత ఏడాది మే 12 న కేసు నమోదైనట్టు అధికారికంగా ప్రకటించారు. అప్పటినుంచి కొవిడ్ గణాంకాలను వెల్లడించడం లేదు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేసింది.