న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అమెరికా, బ్రిటన్‌లాంటి దేశాలల్లో విధ్వంసం సృష్టిస్తున్నది. ఈ కొత్త ముప్పును అరికట్టేందుకు ప్రపంచదేశాలు కొత్తగా ఆంక్షలు అమలులోకి తీసుకువస్తున్నాయి. ఈ క్రమంలో విమానయాన రంగంపై మరోసారి పెను ప్రభావంపడుతున్నది. క్రిస్మస్ నేపథ్యంలో ఈ వారంలో ప్రపంచవ్యాప్తంగా 4,500 విమాన సర్వీసులు రద్దయ్యాయి.
విమాన ట్రాకింగ్ వెబ్సైట్ FlightAware.com ప్రకారం.. క్రిస్మస్ ఈవ్ శుక్రవారం రోజున కనీసం 2,366 విమానాలు రద్దు చేశారు. అదే సమయంలో దాదాపు 9వేల విమానాల రాకపోకలు ఆలస్యంగా నడిచాయి. క్రిస్మస్ రోజైన శనివారం మరో 1,779 విమానాలను నిలిచిపోయాయి. 402 విమానాలను ఆదివారానికి షెడ్యూల్ చేశారు. అమెరికాలో ఒక వారంలో 25శాతం కంటే ఎక్కువ విమానాలను రద్దు చేశారు.
ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 1.51లక్షల ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దాదాపు నెల రోజుల కిందట దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ తొలి కేసు నమోదైంది. కొత్త వేరియంట్ వేగంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. కేవలం నెల రోజుల్లోనే ఒమిక్రాన్ 108 దేశాలకు సోకింది. ప్రపంచవ్యాప్తంగా 1,51,368 కేసులు నమోదవగా.. 26 మంది ఈ వేరియంట్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. విమానయాన రంగ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఒమిక్రాన్ బారినపడుతున్నారు. దీంతో విమానయాన సంస్థల్లో ఉద్యోగుల కొరత వేధిస్తుండగా.. ఆయా సంస్థలపై ప్రభావం చూపుతోంది. అమెరికాలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్‌లైన్స్ బదిలీ కారణంగా తీవ్రమైన సిబ్బంది కొరత నేపథ్యంలో శుక్రవారం దాదాపు 280 విమానాలు రద్దు చేశాయి.
అమెరికాలో ఓ వైపు ఒమిక్రాన్ తీవ్ర ప్రభావం చూపుతుండగా.. మరో వైపు కరోనా మహమ్మారి ఉధృతి పెరుగుతున్నది. చాలా రాష్ట్రాల్లో 90శాతం వరకు ఇన్ఫెక్షన్ పెరిగింది. గతవారంలో అమెరికాలో సగటున 45శాతం కేసులు పెరిగి.. 1.79లక్షలకు చేరాయి. మరో వైపు న్యూయార్క్‌లో శుక్రవారం ఒకే రోజు 44వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. మరో పది రాష్ట్రాల్లో గురు, శుక్రవారాల్లో రికార్డు స్థాయిలో రోజువారీ కేసులు రికార్డయ్యాయి. కరోనా విధ్వంసం అమెరికాతో పాటు బ్రిటన్‌లో మరోసారి మొదలైంది. గతవారం వరకు 20 మందిలో ఒకరికి కరోనా సోకగా.. ఈ వారం మొదట్లో పది మందిలో ఒకరు కరోనా బారినపడ్డారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, శుక్రవారం ఇంగ్లాండ్‌లో 1,22,186 కొత్త కేసులు రికార్డయ్యాయి.