జుహాయ్, నవంబర్ 12: చైనాలోని జుహాయ్ నగరంలో ఓ క్రీడల కేంద్రంపైకి కారు దూసుకెళ్లడంతో 35 మంది మృతి చెందారని, 43 మంది గాయపడ్డారని ఆ దేశ పోలీసులు సోమవారం వెల్లడించారు. ఘటనకు కారకుడైన కారు డ్రైవర్(62)ను అరెస్ట్ చేశామని తెలిపారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతున్నదని తెలిపారు.
మంగళవారం జుహాయ్ వాయు ప్రదర్శన ప్రారంభమైందని.. కారు ప్రమాదం సోమవారం రాత్రి జరిగిందని వెల్లడించారు. డ్రైవర్ తన కారుతో చాలా మంది పాదచారులను ఢీ కొట్టాడని తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు డజన్ల మంది క్రీడల కేంద్రంలోని రన్నింగ్ ట్రాక్‌పై పడుకొని ఉన్న దృశ్యాలు ప్రమాద వీడియోల్లో కనిపించాయి. ఈ వార్తకు సంబంధించిన పోస్టింగులపై మీడియా, సోషల్ మీడియాపై అధికారులు సెన్సార్ విధించారు.