బీజింగ్: చైనాలోని ఇంచువాన్లో ఓ రెస్టారెంట్లో గ్యాస్ పేలుడు సంభవించింది. ఇంచువాన్ (Yinchuan) నగరంలోని బార్బెక్యూ రెస్టారెంట్లో (Barbecue Restaurant) ఎల్పీజీ గ్యాస్ (LPG Gas) లీకవడంతో భారీ పేలుడు (Explosion) చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో 31 మంది దుర్మరణం చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. బుధవారం రాత్రి 8.40 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు.
గాయపడిన వారిలో ఇద్దరు తీవ్రమైన కాలిన గాయాలతో ఇబ్బంది పడుతున్నారని, మరో ఇద్దరికి స్వల్పంగా గాయాలయ్యాయని, పేలుడు ధాటికి పగిలిపోయిన అద్దాలు ఇద్దరికి గుచ్చుకున్నాయని అధికారులు వెల్లడించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. రెస్టారెంట్ నుంచి దట్టమైన పొగలు వ్యాపించాయని స్థానికులు చెప్పారు. అయితే రెస్టారెంటులో రెస్క్యూ ఆపరేషన్ ముగిసిందని గురువారం ఉదయం చైనా అత్యవసర నిర్వహిణ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
చైనాలో ప్రస్తుతం డ్రాగన్ డే ఫెస్టివల్ (Dragon Boat Festival) జరుగుతున్నది. మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలకోసం ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దీంతో ప్రజలు వారి స్నేహితులతో కలిసి ఈ వేడుకలను జరుపుకుంటూ ఉంటారు. ఈక్రమంలో బార్బేక్యూ రెస్టారెంట్లో కొంతమంది పండుగను సెలబ్రేట్ చేసుకుంటుండగా ప్రమాదం జరిగిందని అధికారులు చెప్పారు.