London | సెంట్రల్ లండన్లో జరిగిన ఓ సంఘటనలో ముగ్గురికి కత్తిపోట్లు అయ్యాయి. వెంటనే గుర్తించిన పోలీసులు వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని దవాఖానకు తరలించారు. కత్తితో దాడికి పాల్పడిన వారు పారిపోయినట్లు రైల్వే స్టేషన్ వద్ద బందోబస్తులో ఉన్న పోలీసులు తెలిపారు. వీరిని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
సెంట్రల్ లండన్లోని లివర్పూల్ రైల్వే స్టేషన్ బిషప్ గేట్ సమీపంలో గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు అక్కడివారిపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులకు కత్తిపోట్లయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని దవాఖానకు పోలీసులు తరలించారు. ఈ దాడిని ఉగ్ర దాడిగా భావించడం లేదని స్థానికులు చెప్పారు.
ఉదయం 10 గంటల సమయంలో లివర్పూల్ రైల్వే స్టేషన్ బిషప్గేట్లో ఒక వ్యక్తిని నేలపైకి పడదోసి కత్తితో పొడిచినట్లు స్థానిక పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి చేరుకోగా కత్తిపోట్లకు గురైన ముగ్గురు వ్యక్తులు కనిపించారు. దోపిడీ కోసం చేసిన కత్తి దాడిగా పరిగణిస్తున్నట్లు లండన్ సిటీ పోలీసులు పేర్కొన్నారు. మొబైల్ ఫోన్ దొంగల పనిగా స్థానిక పోలీసులు అనుమానిస్తున్నారు. బిషప్ గేట్ సమీపంలో పాదాచారుల నుంచి మొబైల్ ఫోన్లు లాక్కొనే క్రమంలో కత్తితో దాడి చేసి గాయపర్చినట్లుగా ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. తదుపరి కేసు నమోదు చేసుకుని సెంట్రల్ లండన్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.