బెర్లిన్: జర్మనీలో (Germany) ఘోర రైలు ప్రమాదం జరిగింది. 100 మందితో వెళ్తున్న రైలు పట్టాలు తప్పడంతో (Train Derails) ముగ్గురు మృతిచెందగా, 34 మంది గాయపడ్డారు. జర్మనీలోని సిగ్మరింగెన్ పట్టణం నుంచి ఉల్మ్ నగరానికి వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఆదివారం సాయంత్రం 6.10 గంటలకు (అక్కడి కాలమానం ప్రకారం) బాడెన్-వుర్టెంబర్గ్ పరిధిలోని రీడ్లింగెన్ పట్టణానికి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు మృతిచెందారని పోలీసులు తెలిపారు. అయితే తొలుత నలుగురు మరణించారని అధికారులు ప్రకటించారు. అనంతరం ముగ్గురు మాత్రమే చనిపోయారని, మరొకరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. రెండు రైలు బోగీలు పట్టాలు తప్పాయని, దానికిగల కారణం తెలియరాలేదని వెల్లడించారు. ప్రమాదం నేపథ్యంలో ఆ మార్గంలో 40 కిలోమీటర్ల మేర రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.
జర్మన్ చాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. రవాణా మంత్రులతో మాట్లాడుతున్నానని, అత్యవసర సేవలను అందించాలని కోరానన్నారు. 2022 జూన్లో దక్షిణ జర్మనీలోని బవేరియన్ ఆల్పైన్ రిసార్ట్ సమీపంలో ఓ రైలు పట్టాలు తపడ్డంతో నలుగురు మృతిచెందారు. 1998లో లోయర్ సాక్సోనీలోని ఎస్చెడ్లో హై-స్పీడ్ రైలు పట్టాలు తప్పగా, 101 మంది మృతిచెందారు.