లాహోర్: పాకిస్థాన్‌లో రైలు పట్టాలు తప్పిన(Train Derail) ఘటనలో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. లాహోర్ సమీపంలో ఇస్లామాబాద్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ముగ్గురు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. లాహోర్ నుంచి రావల్పిండి వెళ్తున్న రైలు కాలా షా కాకు వద్ద డిరేల్ అయినట్లు పాకిస్థాన్ రైల్వేశాఖ తెలిపింది. లాహోర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది.
రైలుకు చెందిన పది బోగీలు పట్టాలు తప్పాయి. రెస్క్యూ బృందాలు తక్షణమే స్పందించాయి. గాయపడ్డవారిని సమీప ఆస్పత్రికి తరలించారు. డిరేల్ అయిన బోగీల్లో చిక్కుకున్నవారిని తొలగించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం పట్ల దర్యాప్తు చేయాలని రైల్వే శాఖ మంత్రి మొహమ్మద్ హనిఫ్ అబ్బాస్ ఆదేశించారు. ఏడు రోజుల్లోనే రిపోర్టు ఇవ్వాలన్నారు.