ఢాకా: బంగ్లాదేశ్లో దారుణం జరిగింది. రూ.35 వేల అప్పు తీర్చలేదన్న కారణంగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ)కి చెందిన స్థానిక నాయకుడొకరు హిందూ మహిళ(21)పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. స్థానిక మీడియా కథనం ప్రకారం.. జూన్ 26న బాధితురాలు కుమిల్లాలోని తన పుట్టింట్లో ఉండగా ఈ ఘటన జరిగింది. రాత్రి 11 గంటలకు నిందితుడు ఫజర్ అలీ(36) తలుపు తట్టినప్పుడు బాధితురాలు జవాబివ్వడానికి నిరాకరించింది. దీంతో అతడు తలుపు బద్దలు కొట్టి ఆమెను వివస్త్రను చేసి, కొట్టి, లైంగిక దాడికి పాల్పడ్డాడు.
బాధితురాలి అరుపులు విని అక్కడకు చేరుకున్న స్థానికులు నిందితుడిని కొట్టి దవాఖానలో చేర్చారు. స్థానికులు తీసిన బాధితురాలి వీడియో వైరల్ అయిన తర్వాతనే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. రేప్ ఘటనను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఆదివారం ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు క్యాంపస్లో ధర్నా నిర్వహించారు. బాధితురాలికి సంబంధించి వైరల్ అయిన వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించాలని అధికారులను హైకోర్ట్ ఆదేశించింది.