సిడ్నీ: ఆస్ట్రేలియాలో సన్‌స్క్రీన్(Sunscreens) ఉత్పత్తులపై స్థానిక ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. తాజాగా మరో 18 రకాల ప్రోడక్ట్స్‌పై ఆంక్షలు విధించింది. దీంతో వాటిని మార్కెట్ల నుంచి కంపెనీలు వెనక్కి తెప్పిస్తున్నాయి. స్కిన్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకున్నది. సన్‌స్క్రీన్ లోషన్లకు చెందిన ఖరీదైన ఉత్పత్తుల్లో నాణ్యత లేదని వినియోగదారుల అడ్వకసీ గ్రూపు గుర్తించింది.
సన్‌స్క్రీన్ ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు ముందుగా పేర్కొన్నట్లు స్కిన్ క్యాన్సర్ నుంచి రక్షణ కల్పించడం లేదని ఆ గ్రూపు ఆందోళన వ్యక్తం చేసింది. స్కిన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్(ఎస్పీఎఫ్) 21 కన్నా ఎక్కువ ఉన్న ఉత్పత్తులను ప్రిఫర్ చేయాలని ఆస్ట్రేలియా ఆరోగ్యశాఖ చెబుతోంది. కానీ మార్కెట్లు విస్తృతంగా అమ్ముడవుతున్న ఉత్పత్తుల్లో ఎస్పీఎఫ్ కావాల్సినంత లేనట్లు గుర్తించారు.
వేర్వేరు బ్రాండ్లకు చెందిన సన్‌స్క్రీన్ ఉత్పత్తులపై దర్యాప్తుదారులు చర్యలకు దిగారు. సుమారు 20 ఉత్పత్తుల విషయంలో రెగ్యులేటర్లు వార్నింగ్ ఇచ్చారు. అతినీలోహిత కిరణాల నుంచి రక్షణ పొందేందుకు సన్‌స్క్రీన్ వాడుతుంటారు. అనేక రకాల లాభాలను దృష్టిలో పెట్టుకుని ఆ లోషన్లను వినియోగిస్తుంటారు.