దుబాయ్, జనవరి 13: ఇరాన్లో ఖమేనీ సర్కార్‌కు వ్యతిరేకంగా నిరసనలు మరింత తీవ్రమయ్యాయి. నిరసనకారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. ఆందోళనల్లో 2 వేల మంది మరణించినట్టు స్వయంగా ప్రభుత్వమే అంగీకరించింది. మృతుల్లో పౌరులతో పాటు ప్రభుత్వ భద్రతా సిబ్బంది కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు, విధ్వంసకారుల చేతుల్లో ఈ మరణాలు సంభవించాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఈ సంఖ్యను విపక్షాల అనుకూల వెబ్సైట్ ఇరాన్ ఇంటర్నేషనల్ తీవ్రంగా ఖండించింది.
ఇరాన్ భద్రతా దళాల చేతుల్లో 12 వేల మందికి పైగానే ఇరాన్ పౌరులు మరణించారని వెల్లడించింది. ఇది ఇరాన్ ఆధునిక చరిత్రలో అతి పెద్ద మారణ హోమంగా అభివర్ణించింది. ఇరాన్ ప్రభుత్వం సొంత భద్రతా సంస్థలు, ఇతర సంస్థల నుంచి అందిన సమాచారం మేరకు ఈ మృతుల సంఖ్యను పేర్కొన్నట్టు ఈ వెబ్సైట్ వెల్లడించింది. కాగా, ప్రస్తుతం దేశంలో ఇంటర్నెట్పై నిషేధం అమలువుతున్నందున పూర్తి సమాచారం అందడం లేదని, అందుకే మృతుల సంఖ్య స్పష్టంగా తెలియడం లేదని పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. పౌరులు, భద్రతా సిబ్బంది మరణాల వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందని ఒక ఇరాన్ అధికారి తెలిపారు.
అయితే ఏ ఉగ్రవాదులు వారిని చంపారో ఆయన వివరించ లేదు. గత మూడేండ్లుగా అంతర్గతంగా ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న ఇరాన్ గత ఏడాది అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు దాడి చేయడంతో మరింత కుదేలైంది. దీనికితోడు పాలకుల అణచివేత విధానాలు కూడా పౌరుల్లో తిరుగుబాటుకు దారితీసింది. 1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత అధికారంలో ఉన్న మతాధికారులు దేశంలోని నిరసనలు అణచివేయడానికి ద్వంద్వ విధానాలు అవలంబించారు. ఒక పక్క దేశంలో నెలకొన్న దుస్థితికి అమెరికా, ఇజ్రాయెల్ కారణమని ఆరోపిస్తూనే, కొందరు గుర్తు తెలియని ఉగ్రవాదులు ఆందోళనలను హైజాక్ చేశారని విమర్శిస్తున్నారు.
అంతర్జాతీయ కాల్స్ పునరుద్ధరణ
ఇరాన్లో ఆందోళనలతో దేశంలో కమ్యూనికేషన్ గురువారం నుంచి పూర్తిగా బంద్ అయిపోయింది. అయితే ఇంచుమించు ఐదు రోజు ల తర్వాత ఫోన్ సౌకర్యాన్ని పునరుద్ధరించారు. తమ మొబైల్ ఫోన్ల నుంచి మంగళవారం ఇంటర్నేషనల్ కాల్స్ చేసుకోవడానికి పౌరులకు కొన్ని నిబంధనలతో అవకాశం కల్పించారు. ఇంటర్నెట్, టెక్స్ మెసేజ్‌లపై విధించిన నిషేధం మాత్రం కొనసాగుతూనే ఉంది. దీంతో పలువురు ఇరాన్‌వాసులు అసోసియేటెడ్ ప్రెస్, ఇతర మాధ్యమాల వారితో మాట్లాడారు. అయితే వారికి తిరిగి కాల్ చేస్తే ఫోన్లు వెళ్లలేదని దుబాయ్‌లోని ఏపీ బ్యూరో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వర్గాలు తెలిపాయి.
ప్రభుత్వ సంస్థలను స్వాధీనం చేసుకోండి: ట్రంప్
ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగించాలని ఆ దేశ పౌరులకు పిలుపునిచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వారికి సహాయం అందుతుందని హామీనిచ్చారు. ‘ఇరాన్ దేశభక్తులారా, మీ నిరసనలు కొనసాగించండి. ప్రభుత్వ సంస్థలను ఆధీనంలోకి తీసుకోండి. హంతకులు, దుర్వినియోగదారుల పేర్లను నమోదు చేసుకోండి. వారు భారీ మూల్యం చెల్లించుకుంటారు. నిరసనకారులను అర్థం లేకుండా చంపడం ఆగిపోయే వరకు ఇరానియన్ అధికారులతో అన్ని సమావేశాలను రద్దు చేశాను. నిరసనకారులకు సాయం అందిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.‘మేక్ ఇరాన్ గ్రేట్ ఎగైన్’ అంటూ పిలుపునిచ్చారు.
తీవ్ర పరిణామాలు తప్పవు: రష్యా
ట్రంప్ హెచ్చరికలపై రష్యా తీవ్రంగా స్పందించింది. ఇది ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో విధ్వంసకర బాహ్య జోక్యమని పేర్కొంది. పశ్చిమాసియాలో పరిస్థితికి, ప్రపంచ అంతర్జాతీయ భద్రతకు ఇటువంటి చర్యల వినాశకరమైన పరిణామాల గురించి తెలుసుకోవాలని అమెరికాను హెచ్చరించింది.