బొగోటా: విమానం కూలిన (Plane Crash) 17 రోజుల తర్వాత పసి బాబుతో సహా నలుగురు పిల్లలు సజీవంగా ఉన్నారు. అమెజాన్ అటవీ ప్రాంతంలో చిక్కుకున్న వారిని సైన్యం, ఫైర్, రెస్క్యూ బృందాలు కాపాడాయి. దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో ఈ సంఘటన జరిగింది. మే 1న తెల్లవారుజామున సెస్నా 206 చిన్న విమానం అమెజానాస్, గువావియర్ ప్రావిన్సుల మధ్య ఉన్న అమెజాన్ అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఆ సమయంలో పైలట్‌తో సహా ఏడుగురు అందులో ప్రయాణిస్తున్నారు. భార్యాభర్తలతోపాటు వారి పిల్లలైన 11 నెలల బాబు, నాలుగు, తొమ్మిదేళ్ల కుమారులు, 13 ఏళ్ల కుమార్తె అందులో ఉన్నారు. ఆ విమానం కూలిన సంఘటనలో పైలట్, భార్యాభర్తలు మరణించారు. అయితే నలుగురు పిల్లలు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ధైర్యం కోల్పోని ఆ చిన్నారులు దట్టమైన అమెజాన్ అటవీ ప్రాంతంలో తిరుగుతూ అక్కడి చెట్ల పండ్లు తింటూ రెండు వారాలకుపైగా వారు బతికారు.
కాగా, ఇంజిన్‌లో సాంకేతిక లోపం వల్ల విమానం కూలినప్పుడు పైలట్ పంపిన ప్రమాద సంకేతంపై సంబంధిత అధికారులు స్పందించారు. విమానం కూలిన ప్రాంతం పరిధిలోని రెండు ప్రావిన్సులకు చెందిన వంద మందికిపైగా సైన్యం, డాగ్ స్క్వాడ్, ఫైర్, రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు రెండు వారాల తర్వాత విమానం కూలిన ప్రాంతానికి వారి చేరుకున్నారు. పైలట్‌తోపాటు మరో ఇద్దరి మృతదేహాలను ఆ విమానంలో కనుగొన్నారు.
మరోవైపు కనిపించకుండా పోయిన నలుగురు పిల్లల కోసం అమెజాన్ అటవీ ప్రాంతంలో విస్తృతంగా గాలించారు. చివరకు 11 నెలల పసి బాబుతో సహా నలుగురు పిల్లలను బుధవారం గుర్తించారు. వారిని కాపాడి సురక్షిత ప్రాంతానికి చేర్చినట్లు కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తెలిపారు. విమానం కూలిన 17 రోజుల తర్వాత కూడా ఆ చిన్నారులు జీవించి ఉండటం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.