జెరుసలాం: లెబనాన్‌లోని హిజ్బుల్లాను టార్గెట్ చేస్తూ శుక్రవారం ఇజ్రాయెల్ రక్షణ దళాలు(Israel Strikes) అటాక్ చేశాయి. ఆ దాడుల్లో సుమారు 16 మంది మృతిచెందారు. అనేక మంది గాయపడినట్లు స్థానిక మీడియా పేర్కొన్నది. ఇజ్రాయెల్, లెబనాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఉండాలని అమెరికా-ఇరాన్ ఒప్పందంలో ఉన్నా.. లెబనాన్‌పై మాత్రం దాడులు ఆగలేదు. ఐడీఎఫ్ ఇవాళ ఆ దాడులకు సంబంధించిన ప్రకటన చేసింది. దక్షిణ లెబనాన్‌లో రాత్రిపూట దాడులు చేసినట్లు ఐడీఎఫ్ చెప్పింది. హిజ్బుల్లా ఏకధాటిగా కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతోందని, దీనిలో భాగంగానే ప్రతిదాడి చేశామని ఐడీఎఫ్ తెలిపింది.
మరో వైపు అమెరికా, ఇరాన్ మధ్య స్విట్జర్లాండ్‌లో జరగాల్సిన చర్చలను వాయిదా చేశారు. ఈ విషయాన్ని స్విస్ విదేశాంగ మంత్రి వెల్లడించారు. కానీ ఆ చర్చలను నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు స్విస్ విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొన్నది. అమెరికా, ఇరాన్, ఖతార్, పాక్ మధ్య జరగాల్సిన ప్రతిపాద చర్చలు వాయిదా పడ్డాయని ప్రకటనలో తెలిపారు. శుక్రవారం జరగాల్సిన చర్చల్లో పాల్గొనేందుకు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెళ్లడం లేదని శ్వేతసౌధ ప్రతినిధి వెల్లడించారు.