ల్వీవ్, మార్చి 8: కన్నతల్లి లాంటి సొంతూరును వీడాలని లేకున్నా.. ప్రాణాలను కాపాడుకోవడంతో పాటు కన్నబిడ్డల భవిష్యత్తు కోసం వాళ్లు ఊరు విడవక తప్పలేదు. గత రెండు వారాలుగా రష్యా భీకర దాడులతో దద్దరిల్లిన ఉక్రెయిన్లోని ప్రధాన నగరాల్లో మంగళవారం నిశ్శబ్ధ వాతావరణం రాజ్యమేలింది. కల్లోల భూమిలో చిక్కుకొన్న పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి మానవతా కారిడార్ల ఏర్పాటుకు ఇరు దేశాల ప్రతినిధులు అంగీకరించారు. దీంతో కీవ్, సుమీ, మరియుపోల్, చెర్నిహీవ్, ఖార్కీవ్ నగరాల్లో 12 గంటల పాటు కాల్పుల విరమణ ప్రకటించిన అనంతరం పౌరుల తరలింపు ప్రక్రియ మొదలైంది. సొంతూరుకు మళ్లీ వస్తామో, రాలేమో తెలియని సందిగ్ధంతోనే వేలాదిమంది పౌరులు బరువెక్కిన హృదయాలతో కదిలారు. సొంతూళ్లను వదిలివెళ్లేటప్పుడు పలువురు కన్నీటి పర్యంతం కావడం అందరి హృదయాలను మెలిపెట్టింది. మరోవైపు, యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 20 లక్షల మంది ఉక్రెయిన్ను విడిచిపెట్టి వెళ్లినట్టు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.
సుమీలో చిక్కుకొన్న 694 మంది భారతీయ విద్యార్థులను సురక్షితంగా అక్కడి నుంచి తరలించామని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. పోల్తావాకు వాళ్లను తీసుకువెళ్లినట్టు వెల్లడించారు. ఇప్పటివరకూ 17,100 మందిని స్వదేశానికి తీసుకొచ్చినట్టు వివరించారు. మరోవైపు, మైకొలైవ్ తీర ప్రాంత నగరంలో చిక్కుకొన్న 75 మంది భారత నావికుల్లో 52 మందిని ఇప్పటికే తరలించామని ఇండియన్ ఎంబసీ ప్రకటించింది. మిగతా 23 మందిని మంగళవారం రాత్రివరకూ తరలించనున్నట్టు వెల్లడించింది.
హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): ఉక్రెయిన్లో చిక్కుకున్న మరో 9 మంది తెలంగాణ విద్యార్థులు మంగళవారం భారత్కు వచ్చారు. ఢిల్లీలో దిగిన వీరిని స్వస్థలాలకు పంపించారు. ఉక్రెయిన్ నుంచి ఇప్పటి వరకు 635 మంది తెలంగాణ విద్యార్థులు స్వదేశానికి వచ్చారు. మరోవైపు, సుమీ నుంచి పోల్తావాకు ప్రయాణమైన 700 మంది భారతీయుల్లో 15 మంది తెలంగాణ విద్యార్థులున్నట్టు సమాచారం.