న్యూ ఓర్లీన్స్: అమెరికాలోని న్యూ ఓర్లీన్స్లో నూతన సంవత్సరం వేడుకలు విషాదం మిగిల్చింది. విలాస వేడుకలకు పేరుపొందిన బార్బన్ స్ట్రీట్, ఐబర్విల్లే మధ్య వీధిలో బుధవారం తెల్లవారుజామున 3.15 గంటల ప్రాంతంలో ఓ దుండగుడు తన పికప్ ట్రక్‌తో (Pickup Truck) జన మూహంపైకి దూసుకొచ్చాడు. భయంతో జనం పరుగుత్తుతుండగా ట్రక్కు నుంచి దిగిన డ్రైవర్ జనంపైకి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 15కు చేరింది. 35 మంది వరకు గాయపడ్డారు. అయితే పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో నిందితుడు హతమయ్యాడు. ఈ ఘటనపై ఉగ్రవాద చర్య కోణంలో ఎఫ్‌బీఐ దర్యాప్తు చేపట్టింది. దుండగుడిని షంషుద్దీన్ జబ్బార్‌గా (42) గుర్తించారు. అతడు అమెరికా పౌరుడేనని, టెక్సాస్‌కు చెందిన వ్యక్తని పోలీసులు తెలిపారు. అతని వాహనంలో ఉగ్ర సంస్థ అయిన ఐసిస్ జెండా లభించిందని వెల్లడించారు.
ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యలని నగర పోలీసుకమిషనర్ అన్నే కిర్క్‌పాట్రిక్ తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే మారణకాండ సృష్టించడానికి ట్రక్కు డ్రైవర్ ప్రయత్నించాడని ఆయన చెప్పారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులు గాయపడ్డారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన చెప్పారు. కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకునేందుకు వేలాది మంది బార్బన్ వీధిలో ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించడంతో అక్కడకు ఎవరూ ఆ ప్రాంతానికి వెళ్లవద్దని ప్రజలను పోలీసులు కోరారు. ఘటనలో గాయపడిన వారిని దవాఖానలకు తరలించి చికిత్స అందచేస్తున్నారు.
అసలు ఏం జరిగిందంటే..
న్యూఆర్లీన్స్‌లోని బార్బన్ వీధిలో జరిగిన న్యూఇయర్ వేడుకలకు ప్రతి ఏడాదిలాగే ఈ సారీ కూడా వేలాది మంది తరలి వచ్చారు. అయితే బుధవారం సాయంత్రం అక్కడికి దగ్గర్లో ఉన్న ఓ స్టేడియంలో ఫుట్‌బాల్ మ్యాచ్ ఉండటం వల్ల ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. చాలా మంది మ్యాచ్‌ను చూసేందుకు ఆ ప్రాంతానికి ముందుగానే వచ్చారు. అయితే బుధవారం తెల్లవారుజామున 3.15 సమయంలో వారందరూ సంబురాల కోసం రోడ్డుపై ఉన్నప్పుడు దుండగుడు వాహనంతో వారిపైకి ఒక్కసారిగా దూసుకెళ్లాడు. దీంతో అక్కడివారంతా చెల్లాచెదురయ్యారు.
ఈ ఘటనలో ఇప్పటి వరకు 15 మంది మృతి చెందగా, మరో 35 మంది గాయపడ్డారు. దాడి తర్వాత దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. అయితే పోలీసుల కాల్పుల్లో అతడు మృతిచెందాడు. దుండగుడి కాల్పుల్లో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స కోసం 5 ఆసుపత్రులకు తరలించారు. అందులో ఇద్దరు ఇజ్రాయెలీలు ఉన్నారని తెలుస్తున్నది.