Strait of Hormuz : హార్ముజ్ జలసంధి అంశం ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఒకపక్క ఈ జలసంధిని దిగ్బంధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఇక్కడ చిక్కుకుపోయిన నౌకల విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఇండియాకు సంబంధించి ఇటీవల కొన్ని నౌకలు హార్ముజ్ నుంచి బయటకు వచ్చాయి. అయినప్పటికీ, ఇంకా 15 ఇండియన్ నౌకలు ఈ జలసంధిలోనే చిక్కుకుపోయాయి. హార్ముజ్ జలసంధి పశ్చిమ దిశలోని చెక్ పాయింట్ వద్ద 15 భారత నౌకలు నిలిచిపోయాయి. ఇరాన్‌తో చర్చలు విఫలమవ్వడంతో హార్ముజ్‌ను అమెరికా దిగ్బంధించే పనిలో ఉంది.
మొత్తం జలసంధిని తన వాణిజ్య, యుద్ధ నౌకలతో దిగ్బంధించాలని అమెరికా భావిస్తోంది. సోమవారం నుంచి తమ చర్యలు ప్రారంభమవుతాయని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అలాగే, గల్ఫ్ దేశాల చుట్టూ ఉన్న ఇరాన్ పోర్టులన్నింటినీ దిగ్బంధిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో అక్కడ నిలిచిపోయిన మన నౌకల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే ఈ మార్గంలో నౌకల రవాణా నెమ్మదిగా సాగుతోంది. హార్ముజ్‌ను అమెరికా దిగ్బంధిస్తే ప్రపంచంలోని అనేక దేశాల నౌకలకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. చమురు సహా ఆహారం, ఔషధాలు, ఇతర సరుకుల రవాణాపై తీవ్ర ప్రభావం పడుతుంది. చమురు ధరలు విపరీతంగా పెరుగుతాయి. ఈ దిగ్బంధం ఎక్కువ రోజులు కొనసాగితే బ్యారెల్ క్రూడాయిల్ ధర 150 డాలర్ల వరకు చేరుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇండియాకు చెందిన ఆరు నౌకలు పర్షియన్ గల్ఫ్ తీరంలో నిలిచిపోయాయి.
వాటితో ఇండియన్ నేవీ సంప్రదింపులు జరుపుతోంది. వాటి భద్రతకు తగిన చర్యలు తీసుకుంటోంది. ఈ నెల 11న హార్ముజ్ జలసంధిని జగ్ విక్రమ్ అనే ఎల్పీజీ ట్యాంకర్ దాటింది. ఈ నెల 15న ముంబై తీరానికి చేరుకోనుంది. ఈ నౌకలో 20,400 టన్నుల ఎల్పీజీ, 24 మంది సిబ్బంది ఉన్నారు. ఈ నౌక ప్రస్తుతం అరేబియన్ జలాల్లో ఉంది. దీనికి ఇండియన్ నేవీ రక్షణ కల్పిస్తోంది. మరోవైపు ఇరాన్ నుంచి రెండు చమురు నౌకలు ఇండియా చేరుకున్నాయి. ఏడేళ్ల తర్వాత ఇరాన్ చమురును ఇండియా కొనుగోలు చేసింది.