ఖాట్మండు: ప్రపంచమంతా కరోనా థర్డ్ వేవ్ విస్తరిస్తున్నది. హిమాలయ దేశం నేపాల్లోనూ కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నది. ముఖ్యంగా అక్కడి ప్రభుత్వ దవాఖానల్లో హెల్త్వర్కర్లు భారీ సంఖ్యలో మహమ్మారి బారినపడుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఇవాళ నేపాల్ రాజధాని ఖాట్మండులోని ఆరు ప్రభుత్వం దవాఖానల్లో 143 మంది హెల్త్వర్కర్లకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఖాట్మండులోని స్థానిక మీడియా వెల్లడించింది.
ఖాట్మండు వ్యాలీలోని టూ టీచింగ్ ఆస్పత్రిలో 65 మంది హెల్త్వర్కర్లు, బిర్ ఆస్పత్రిలో 35 మంది హెల్త్ వర్కర్లు, పటాన్ ఆస్పత్రిలో 25 మంది హెల్త్ వర్కర్లు, టెకూ ఆస్పత్రిలో నలుగురు హెల్త్ వర్కర్లు, నేపాల్ పోలీస్ ఆస్పత్రిలో 10 మంది హెల్త్ వర్కర్లు, ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఆస్పత్రిలో నలుగురు హెల్త్ వర్కర్లు ఒకేరోజు కరోనా మహమ్మారి బారిన పడినట్లు నేపాల్ మీడియా వెల్లడించింది.
అంతేగాక ఖాట్మండు వ్యాలీ వెలుపల కూడా ఆస్పత్రుల్లో కరోనా ప్రభావం తీవ్రంగానే ఉన్నదని అక్కడ మీడియా పేర్కొన్నది. దంగ్ జిల్లా ఆస్పత్రిలో హెల్త్వర్కర్లు, ఇతర సిబ్బంది సహా 27 మంది మహమ్మారి బారినపడ్డారు. అదేవిధంగా భరత్పూర్ ఆస్పత్రిలో 15 మందికి, అంపీపాల్, బంకే, నాగాయన్పూర్ ఆస్పత్రుల్లో నలుగురు చొప్పున మహోట్టారి, పర్సా ఆస్పత్రుల్లో ఇద్దరు చొప్పున హెల్త్ వర్కర్లు కరోనా బారినపడ్డారు.