Fire in ship | ప్యాసింజర్ పడవలో అగ్నిప్రమాదం సంభవించడంతో 13 మంది దుర్మరణం పాలయ్యారు. పడవలో ప్రయాణిస్తున్న 263 మందిని రెస్క్యూ దళాలు కాపాడాయి. ప్రాణాలతో బయటపడిన వారికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన సెంట్రల్ ఇండోనేషియాలో సోమవారం చోటుచేసుకున్నది.
సెంట్రల్ ఇండోనేషియాలోని తూర్పు నుసా టెంగ్గారా ప్రావిన్స్‌లోని సముద్ర జలాల్లో ప్రయాణిస్తున్న ఓడలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. మంటలు పూర్తిగా పడవను చుట్టుముట్టడంతో పడవలో ఉన్న 13 మంది దుర్మరణం చెందారు. మంటలు అంటుకుని పలువురికి గాయాలయ్యాయి. పడవ నుంచి 263 మందిని రెస్క్యూ దళాలు రక్షించాయి. ఉదయం నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. పడవలో ఎంత మంది ప్రయాణిస్తున్నారనే దానిపై అధికారుల వద్ద సమాచారం లేకపోయింది. ఎంత మంది గల్లంతయ్యారనేది తెలియరాలేదు. మంటలు అంటుకోగానే ప్రయాణికులను మరో ఓడలోకి పంపించివేసినట్లు రెస్క్యూ దళాధిపతి పుటు సుదయన తెలిపారు.
శాంతికా లెస్టారీ అనే ఈ ఓడ కుపాంగ్ నగరానికి సమీపంలోని జలాల్లో ప్రయాణిస్తుండగా అగ్నిప్రమాదం సంభవించినట్లు ప్రావిన్షియల్ డిజాస్టర్ మేనేజిమెంట్ ఏజెన్సీ సీనియర్ అధికారి రిచర్డ్ పెల్ట్ తెలిపారు. ప్రమాదానికి గురైన ఈ ఓడ కుపాంగ్ నగరంలోని ఓడ రేవు నుంచి బయల్దేరి ప్రావిన్స్‌లోని అలోర్ జిల్లాలకు వెళ్తున్నట్లుగా తెలుస్తున్నది. గల్లంతైన వారి ఆచూకీని కనిపెట్టేందుకు రెస్క్యూ సిబ్బంది ఇంకా గాలింపు కొనసాగిస్తన్నారు.