Zelenskyy | రష్యా- ఉక్రెయిన్ యుద్ధం తీవ్రరూపం దాల్చింది. రష్యా వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులకు దిగింది. ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ చేపట్టిన ఈ దాడుల్లో 40కిపైగా రష్యా మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ధ్వంసమయ్యాయి. ఉక్రెయిన్-రష్యా మధ్య ఇస్తాంబుల్‌లో సోమవారం శాంతి చర్చలు జరగనుండగా ఈ దాడులు జరిగాయి. రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా కీలక మిలిటరీ స్థావరాలపై ఉక్రెయిన్ ఇంత భారీ స్థాయిలో దాడి జరపడం ఇదే మొదటిసారి. ఈ దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Zelenskyy) తాజాగా స్పందించారు. దీన్ని అద్భుతమైన ఆపరేషన్‌గా (brilliant operation) అభివర్ణించారు.
తమ సాయుధ దళాలు అద్భుతమైన ఆపరేషన్ నిర్వహించాయన్నారు. ఈ దాడికి స్పైడర్ వెబ్‌గా పేరు పెట్టినట్లు వెల్లడించారు. మూడేళ్లకు పైబడిన యుద్ధంలో ‘మా అత్యంత సుదూర ఆపరేషన్’ ద్వారా ‘అద్భుతమైన’ ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ దాడి ప్రణాళికకు 18 నెలల సమయం పట్టినట్లు చెప్పారు. మొత్తం 117 డ్రోన్లను ఉపయోగించినట్లు వెల్లడించారు.
‘ఇప్పుడే మా స్పెషల్ ఫోర్స్ అధిపతి వాసిల్ మలియుక్ అద్భుతమైన ఆపరేషన్ గురించి వెల్లడించారు. శత్రు భూభాగంలోని సైనిక లక్ష్యాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నాం. ప్రత్యేకంగా ఉక్రెయిన్‌పై దాడి చేయడానికి ఉపయోగించే పరికరాలను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేశాం. మా సాయుధ దళాలు అద్భుతమైన ఆపరేషన్ నిర్వహించాయి. ఈ దాడిలో రష్యా గణనీయమైన నష్టాన్ని చవిచూసింది. ఆ దేశానికి ఇలా జరగాల్సిందే. ఆపరేషన్ ప్రణాళిక కోసం ఏడాదిన్నర సమయం పట్టింది. ప్లాన్ చేసిన ప్రకారంగానే రష్యాపై ఈ ఆపరేషన్‌ను అమలు చేశాం. ఇది పూర్తిగా ప్రత్యేకమైన ఆపరేషన్ అని నేను ఖచ్చితంగా చెబుతా.
ఈ దాడిలో 117 డ్రోన్లను వినియోగించాం. వైమానిక స్థావరాల్లోని 34 శాతం వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి వాహక నౌకలను ధ్వంసం చేశాం. మా దాడిలో రష్యాకు భారీ నష్టం వాటిల్లింది. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ఆపరేషన్ గురించి బహిరంగంగా చెప్పడం. మేం ఆపరేషన్ చేపట్టిన ఆఫీస్, రష్యన్ భూభాగంలోని ఎఫ్ఎస్బీ కార్యలయానికి పక్కనే ఉంది. ఇక ఈ దాడికి సాయం చేసిన వారిని ఆపరేషన్‌కు ముందు రష్యా నుంచి తీసుకొచ్చాం. వారు ఇప్పుడు సురక్షితంగా ఉన్నారు. ఏడాదిన్నర శ్రమ ఫలించినందుకు సంతృప్తిగా ఉంది. మేం ఈ దాడులను కొనసాగిస్తాం’ అని జెలెన్స్కీ పేర్కొన్నారు.
Also Read..
రష్యా వైమానిక స్థావరాలపైఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి
Russian aircrafts downed | రష్యా ఎయిర్‌బేస్‌పై ఉక్రెయిన్ దాడి.. 40కు పైగా యుద్ధ విమానాలు ధ్వంసం