Russia Vs Ukraine | రష్యా-ఉక్రెయిన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. ఉక్రెయిన్ సైనిక శిక్షణా విభాగం ప్రదేశంలో ఆదివారం రష్యా జరిపిన క్షిపణి దాడిలో కనీసం 12 మంది ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మందికిపైగా గాయపడ్డారని ఉక్రెయిన్ గ్రౌండ్ ఫోర్సెస్ తెలిపింది. మధ్యాహ్నం 12:50 గంటలకు ఈ దాడి జరిగిందని పేర్కొంది. అయితే, రష్యా ఒకేసారి 472 డ్రోన్లను ప్రయోగించిందని.. ఇందులో 385 డ్రోన్లను అడ్డుకున్నట్లు చెప్పింది. దాడికి దారి తీసిన పరిస్థితులను వెలికితీసేందుకు ఓ దర్యాప్తు కమిషన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటనలో పేర్కొంది. ఉక్రెయిన్‌లోని ఉత్తర సుమీ ప్రాంతంలో ఒలెక్సివ్కాని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. రష్యా దాడులతో ఉక్రెయిన్ సైతం ప్రతీకార దాడులకు తెగబడింది. ఉక్రెయిన్ పెద్ద సంఖ్యలో డ్రోన్లతో మాస్కోపై దాడికి పాల్పడింది. అయితే, భారీ మొత్తంలో ఉక్రెయిన్ దాడులకు పాల్పడడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
తూర్పు సైబీరియా సరిహద్దులోని సైనిక స్థావరాలే లక్ష్యంగా సుదీర్ఘంగా ప్రయాణించ గల డ్రోన్లను ఉక్రెయిన్ ప్రయోగించింది. ఉక్రెయిన్ దాడిని రష్యాలోని ఇర్కుట్స్ గవర్నర్ ధ్రువీకరించారు. ఆ దేశానికి చెందిన రిమోట్ పైలట్ ఎయిర్‌క్రాఫ్ట్ మిలటరీ యూనిట్‌ను ధ్వంసం చేసినట్లు చెప్పారు. ఒలెన్యా, బెలయా సహా నాలుగు మిలటరీ ఎయిర్‌బేస్‌లపై దాడులు జరిగినట్లు తెలిపింది. అయితే, ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ ఆపరేషన్‌లో 40పైగా రష్యన్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ధ్వంసమైనట్లుగా కీవ్ మీడియా పేర్కొంది. టీయూ 95, టీయూ-22ఎం3 బాంబర్లు, ఏ-50 ఎయిర్ క్రాఫ్ట్ కూడా ధ్వంసమైనట్లు సమాచారం. ఇరుదేశాల మధ్య యుద్ధం మొదలైన తర్వాత పెద్ద ఎత్తున ఉక్రెయిన్ రష్యాలపై దాడులు చేయడం ఇదే తొలిసారి. ఇదిలా ఉండగా.. తాజా పరిణామాల నేపథ్యంలో ఉక్రెయిన్‌తో చర్చలకు రష్యా మరోసారి కోరింది. అయితే, మంత్రి రుస్టెమ్ ఉమెరోవ్ నేతృత్వంలోని ఓ బృందం ఇస్తాంబుల్‌కు బృందం చేరుతుందని అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు.