మాస్కో, జూన్ 1: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం తీవ్రరూపం దాల్చింది. రష్యా వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులకు దిగింది. ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ చేపట్టిన ఈ దాడుల్లో 40కిపైగా రష్యా మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ధ్వంసమయ్యాయి. ఉక్రెయిన్-రష్యా మధ్య ఇస్తాంబుల్‌లో సోమవారం శాంతి చర్చలు జరగనుండగా ఈ దాడులు జరిగాయి. రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా కీలక మిలిటరీ స్థావరాలపై ఉక్రెయిన్ ఇంత భారీ స్థాయిలో దాడి జరపడం ఇదే మొదటిసారి అని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. ఉక్రెయిన్ దాడిలో ధ్వంసమైన ఎయిర్‌క్రాఫ్టుల్లో టీ యూ-95, టీయూ-22 వ్యూహాత్మక బాంబర్లు కూడా ఉన్నాయని పేర్కొంది. కాగా, ఉక్రెయిన్‌పై రష్యా కూడా డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. ఉక్రెయిన్ సైనిక శిక్షణ స్థావరంపై రష్యా జరిపిన క్షిపణి దాడిలో 12 మంది సైనికులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
ఒక వైపు చర్చలు.. మరో వైపు దాడులు
ఇస్తాంబుల్‌లో ప్రత్యక్ష చర్చల కోసం ఇరుపక్షాలు సోమవారం సమావేశమవ్వడానికి ఒక రోజు ముందు రష్యా ఉక్రెయిన్‌పై క్షిపణులు, డ్రోన్లతో దాడి చేయగా, మరో పక్క రష్యాపై ఉక్రెయిన్ వ్యూహాత్మక డ్రోన్ దాడి చేసి భారీగా నష్టాన్ని కలుగజేసింది. ఈ భారీ దాడి కార్యరూపం దాల్చడానికి ఒకటిన్నర సంవత్సరాలు పట్టిందని, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ ఆపరేషన్‌ను స్వయంగా పర్యవేక్షించారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ఉక్రెయిన్ ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో డ్రోన్లను కంటైనర్ ట్రక్కులలో రష్యా భూభాగంలోకి తీసుకెళ్లినట్టు ఆయన చెప్పారు. ఈ ప్రాంతంలో ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేయడం ఇదే మొదటిసారి అని చెప్పారు. రియాజాన్, ముర్మాన్స్ ప్రాంతాల్లో కూడా డ్రోన్ దాడులు జరిగాయని రష్యా అధికారులు తెలిపారు. కాగా, సోమవారం ఇస్తాంబుల్‌లో జరిగే శాంతి చర్చలకు తమ ప్రతినిధులను పంపుతున్నామని జెలెన్స్కీ ప్రకటించిన రోజే ఈ దాడులు జరగడం గమనార్హం.
దాడులు నిర్ధారించిన ఇరు దేశాలు
రష్యాలోని ఇర్కుట్స్ ప్రాంతంలోని స్రెడ్నీ సెటిల్మెంట్లోని సైనిక విభాగంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసిందని రష్యా ప్రాంతీయ గవర్నర్ ఇగోర్ కొబ్జెవ్ నిర్ధారించారు. ఒలెన్యా, బెలాయా సహా ఐదు మిలిటరీ బేస్‌లపై దాడి జరిగినట్టు చెప్పారు. పేలుడుతో మర్మాన్స్ ప్రాంతంలోని ఒలెన్యా ఎయిర్‌బేస్‌లో పేలుళ్లు సంభవించాయని, దట్టంగా పొగ అలుముకుందని స్థానిక మీడియా నెక్సా వెల్లడిస్తూ దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు విడుదల చేసింది. కాగా, అణ్వాయుధాలను మోసుకెళ్లే విమానాలు ఉండే ఈ ఎయిర్‌బేస్ రష్యా అతి ముఖ్య వ్యూహాత్మక ప్రదేశమని ప్రాథమిక నివేదికలు తెలియజేస్తున్నాయి. కాగా, మూడేళ్ల క్రితం పూర్తి స్థాయి దాడి తర్వాత రష్యా.. ఉక్రెయిన్‌పై అత్యధిక సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించిందని ఉక్రెయిన్ వైమానిక దళం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఉక్రెయిన్‌పై 472 డ్రోన్లతో రష్యా దాడిచేసిందని, వీటితో పాటు ఏడు క్షిపణులను కూడా ప్రయోగించిందని ఉక్రెయిన్ కమ్యూనికేషన్స్ హెడ్ యూరీ ఇగ్నాట్ తెలిపారు.
సైనిక శిక్షణ స్థావరంపై రష్యా దాడి.. ; రష్యాలో రెండు బ్రిడ్జిల పేల్చివేత..
రష్యాలోని కుర్స్క్, బ్రయాన్స్లలో రెండు బ్రిడ్జిలను శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పేల్చివేశారు. దీని కారణంగా భారీ రైలు ప్రమాదం సంభవించింది. ఇవి ఉగ్రదాడిగా అనుమానిస్తున్నట్టు రష్యా దర్యాప్తు సంస్థ ప్రకటించింది. శనివారం రాత్రి 10.50 గంటలకు బ్రయాన్స్లో ఒక రోడ్ బ్రిడ్జిని కొందరు పేల్చివేయడంతో కూలిపోయింది. ఈ బ్రిడ్జి కూలి కిందనున్న రైలుపై పడటంతో అందులోని ఏడుగురు మరణించగా, 69 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఈ రైలు మాస్కో నుంచి క్లిమోవ్‌కు వెళ్తున్నది. లోకోపైలట్ కూడా ప్రమాదంలో మరణించాడు. అలాగే ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు కుర్స్క్ ప్రాంతంలోని ఒక రైలు బ్రిడ్జిని కొందరు దుండగులు పేల్చివేశారు. వంతెన కూలిపోవడంతో అదే సమయంలో దానిపై వస్తున్న ఒక సరుకు రవాణా రైలు వంతెన కింద ఉన్న రోడ్డుపై పడిపోయింది. అనంతరం రైలు ఇంజిన్ (లోకోమోటివ్) మంటల్లో చిక్కుకుంది.ఉక్రెయిన్ సైనిక శిక్షణ విభాగంపై రష్యా జరిపిన దాడిలో 12 మంది ఉక్రెయిన్ సైనికులు మరణించగా, 60 మంది గాయపడ్డారు. ఇప్పటికే సైనికుల కొరతతో ఇబ్బంది పడుతున్న ఉక్రెయిన్ సైనికుల సామూహిక సమావేశాలు జరపకుండా చర్యలు తీసుకుంటున్నది. క్షిపణి దాడి జరిగిన ఆదివారం మధ్యాహ్నం 12.50 గంటల సమయంలో కూడా ఎలాంటి సామూహిక సమావేశం జరగడం లేదని, అందుకే తక్కువ ప్రాణనష్టం సంభవించిందని ఒక అధికారి తెలిపారు. కాగా, ఉక్రెయిన్ ఉత్తర సుమీ ప్రాంతంలోని ఒలెక్సివ్కా గ్రామాన్ని తాము ఆధీనంలోకి తెచ్చుకున్నట్టు రష్యా రక్షణ శాఖ మంత్రి ఆదివారం ప్రకటించారు.